
న్యూఢిల్లీ: 2020–-21లో షేర్లు, పాలసీల అమ్మకాల ద్వారా ఎల్ఐసీ రూ.37 వేల కోట్లను సంపాదించింది. ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లు అద్భుతమైన రిటర్నులను ఇచ్చాయి. కార్పొరేషన్ 65 సంవత్సరాల చరిత్రలో ఇంత మొత్తం సంపాదించడం ఇదే మొదటిసారి. స్టాక్ మార్కెట్లు భారీగా ర్యాలీ చేయడంతో కంపెనీ ఎంతో లాభపడింది. 2019 ఆర్థిక సంవత్సరంలో షేర్ల అమ్మకాల నుండి రూ.25,625 కోట్లు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 44.4 శాతం పెరిగింది. ఇదేకాలంలో రూ. 94 వేల కోట్ల విలువైన షేర్లను కూడా ఎల్ఐసీ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్ చేతిలో రూ.34 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. సంస్థకు షేర్ల అమ్మకం ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. వీటిలో పాలసీల బిజినెస్ సైతం ఉంటుంది. వాటాల అమ్మకం ద్వారా భారీ ఆదాయం వచ్చినందున పాలసీహోల్డర్లకు మంచి రిటర్నులు, గవర్నమెంటుకు భారీ డివిడెండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్, మెటల్స్, మైనింగ్, హార్డ్‌వేర్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సెక్టార్ల కంపెనీల స్టాక్స్ బాగా నష్టపోయాయి. ఎల్ఐసీ ఈ రంగాల్లో భారీగానే ఇన్వెస్ట్ చేసింది. అయితే వీటికి నష్టాలు రావడం మొదలవగానే, ఈక్విటీ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీని మార్చి ఇతర సెక్టార్లపై ఫోకస్ చేసింది.
కొన్నింట్లో ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గింపు
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌పై ఎల్‌ఐసీ తన పెట్టుబడులను తగ్గించింది. ఈ సెక్టార్లో గత మార్చినాటికి పెట్టుబడుల విలువ రూ.24 వేల కోట్లు కాగా, ఇప్పుడు రూ. 4,100 కోట్లకు పడిపోయింది. ఇదేకాలంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్లు రూ.55 వేల కోట్ల నుండి రూ. 11,600 కోట్లకు పడిపోయాయి. అమెరికా, యూరప్‌లో ఐటీకి డిమాండ్ తగ్గిపోవడం వల్ల చాలా ఐటీ కంపెనీల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆఫీసులను మూసివేశారు. కరోనా కారణంగా ఫార్మా సెక్టార్ బాగా లాభపడింది. ఫార్మాలో ఇన్వెస్ట్‌మెంట్లు. 17,700 కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు పెంచింది. ఎఫ్ఎంసీజీ (సబ్బులు, షాంపూలు, పేస్టుల తయారు చేసేవి) కంపెనీలు పుంజుకోవడంతో ఈ సెక్టార్ కంపెనీల్లో ఎల్ఐసీ ఇన్వెస్ట్‌మెంట్లను రూ. 15 వేల కోట్ల నుండి రూ. 50 వేల కోట్లకు పెంచింది. ఇదిలా ఉంటే మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వాటాను ఎల్‌ఐసీ ఇటీవల పెంచుకుంది. తాజాగా 12 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ కంపెనీలో 0.097 శాతం వాటా లేదా 12 లక్షల షేర్లను కొన్నామని ఎల్‌ఐసీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. తాజా డీల్‌తో కంపెనీలో ఎల్‌ఐసీ వాటా 5.011 శాతానికి చేరుకుంది. ఎన్‌బీఎఫ్‌సీ అయిన మహీంద్రా ఫైనాన్స్.. మహీంద్రా గ్రూప్‌కు చెందిన కంపెనీ.
త్వరలో ఐపీఓ
ఈ ఏడాది ఎల్‌ఐసీ ఐపీఓ ఉండే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా ఎల్‌ఐసీలో వాటా అమ్మడానికి కార్పొరేషన్ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.25 వేల కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇందుకోసం ఎల్‌ఐసీ చట్టానికి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. రూ.25 వేల కోట్లను 2,500 కోట్ల షేర్లుగా విడగొడతారు. ఒక్కో షేరు విలువ రూ.10 అవుతుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఐపీఓ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎల్‌ఐసీకి 29 కోట్ల పాలసీలు ఉండగా, పెయిడప్ క్యాపిటల్ విలువ రూ.100 కోట్ల వరకు ఉంది. 1956లో కేవలం రూ.ఐదు కోట్ల మూలధనంతో మొదలైన ఎల్‌ఐసీ అసెట్స్ విలువ రూ.31,96,214 కోట్లకు చేరింది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో పూర్తివాటా ప్రభుత్వం దగ్గరే ఉంది. ఐపీఓ ద్వారా 25 శాతం వాటాలు అమ్మిన తరువాత, మిగిలిన 75 శాతం వాటా మొదటి ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది.