హెల్త్ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లోకి ఎల్ఐసీ

హెల్త్ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లోకి ఎల్ఐసీ

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)  కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక  ప్రైవేట్ హెల్త్ ఇన్సూరర్ సంస్థ ద్వారా..  . హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది,  దీని కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా దిగ్గజం ఐదు ప్రైవేట్ స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకదానిని కొనుగోలు చేయాలని చూస్తోంది.  2024 మే 28న  ఎల్ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ్ మోహంతీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు.  

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగు పెట్టాలంటే ప్రభుత్వం ఇప్పటికే ఉన్న బీమా చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం రెగ్యులేటరీ బాడీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI),  1938 ఇన్సూరెన్స్ యాక్ట్, ఒక బీమా సంస్థ కింద జీవిత, సాధారణ లేదా ఆరోగ్య బీమాను చేపట్టేందుకు బీమా సంస్థకు కాంపోజిట్ లైసెన్సింగ్‌ను అనుమతించవు.

అంతకుముందు సిద్ధార్థ్ మోహంతీ.. పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించిన కాంపోజిట్ లైసెన్స్ అనుసరించి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ లైసెన్స్ లభించే అవకాశం ఉందని గతంలో పేర్కొన్నారు.  బీజేపీ నేత జయంత్ సిన్హా నేతృత్వంలోని ప్యానెల్ బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సింగ్ నిబంధనను ప్రవేశపెట్టాలని, వీలైనంత త్వరగా చట్టంలో సవరణ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

ఇదిలా ఉండగా..  ఎల్‌ఐసీ 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నికర లాభంలో స్వల్పంగా 2 శాతం పెరిగి రూ.13 వేల 763 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో బీమా సంస్థ రూ.13 వేల 428 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2024 మార్చిలో వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో 26.41 శాతం పెరిగి రూ. 36,300.62 కోట్లకు చేరిందని, ఏడాది క్రితం ఇదే నెలలో రూ. 28,716.23 కోట్లకు చేరిందని ఎల్‌ఐసీ వెల్లడించింది.