కాగజ్ నగర్, వెలుగు: హత్యకేసులో ఒకరికి జీవితఖైదు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ అట్రాసిటి కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ నితికాపంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో సిర్పూర్(టి) పరిధిలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు యూపీకి చెందిన ఓం ప్రకాశ్ తన ఊరికి చెందిన కొందరిని కూలీ పనులకు తీసుకొచ్చాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఓం ప్రకాశ్, బిర్జు అనే వ్యక్తి మధ్య కూలి విషయంలో గొడవ జరిగింది.
దీంతో ఓం ప్రకాశ్ కత్తితో బిర్జును చాతిలో పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడు చనిపోయాడు. ఘటనపై కౌటాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. సాక్షులను విచారించి ఓం ప్రకాశ్ ను దోషిగా తేల్చి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
