చైనాలో ఇక నుంచి సామాన్యులు కూడా రోబోలను కొనుక్కోవచ్చు !

చైనాలో ఇక నుంచి సామాన్యులు కూడా రోబోలను కొనుక్కోవచ్చు !

చైనాలో ఇక నుంచి సామాన్యులు కూడా వాళ్లకు నచ్చిన రోబోలను కొనుక్కోవచ్చు. అందు కోసం బీజింగ్‌‌‌‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో షాపింగ్ మాల్‌‌‌‌ని ప్రారంభించారు. హ్యూమనాయిడ్ టెక్నాలజీని కస్టమర్లకు నేరుగా అందించేందుకే దీన్ని ఏర్పాటుచేశారు. బీజింగ్‌‌‌‌లోని హై–టెక్ ఈ -టౌన్ జిల్లాలో ఉన్న ఈ రోబో మాల్ ఆటోమొబైల్ డీలర్‌‌‌‌షిప్‌‌‌‌ల్లాగే 4ఎస్‌‌‌‌ మోడల్‌‌‌‌పై పనిచేస్తుంది. అంటే కస్టమర్ సర్వే, సేల్స్‌‌‌‌, సర్వీస్‌‌‌‌, స్పేర్‌‌‌‌‌‌‌‌పార్ట్స్‌‌‌‌.. అన్నీ ఒకేచోట ఉంటాయి. ఈ మాల్‌‌‌‌లో అందరినీ ఆకట్టుకునేందుకు ఆల్బర్ట్ ఐన్‌‌‌‌స్టీన్ హ్యూమనాయిడ్ రెప్లికాని పెట్టారు. నాలుగు అంతస్తుల ఈ మాల్‌‌‌‌లో దాదాపు 200 బ్రాండ్లకు చెందిన వందకు పైగా రకాల రోబోలు ఉన్నాయి. వీటిలో ఉబ్టెక్ రోబోటిక్స్, యూనిట్రీ రోబోటిక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల రోబోలు కూడా ఉన్నాయి.

278 అమెరికన్ డాలర్లు విలువ చేసే సాధారణ రోబోల నుంచి మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. రోబోటిక్ కుక్కలు, చెస్ ఆడే యంత్రాలు, డాన్సింగ్‌‌‌‌ రోబోలు, చైనా చక్రవర్తి క్విన్ షి హువాంగ్, ఐజాక్ న్యూటన్, చైనీస్ కవి లి బాయి లాంటి ఆకారాల్లో ఉన్న రోబోలు ఈ మాల్‌‌‌‌కి స్పెషల్‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచాయి. ఇవేకాకుండా ఈ మాల్‌‌‌‌లో కాఫీ తయారీ, మెడిసిన్‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌, పెయింటింగ్ వేసే రోబోలు కూడా ఉన్నాయి.