జగిత్యాల జిల్లా: బహ్రెయిన్లో జగిత్యాల టౌన్లోని కృష్ణా నగర్కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. అనుమాండ్ల కల్యాణ్(26) అనే యువకుడు పుట్టిన రోజు నాడే ఆత్మహత్య చేసుకున్నాడు. కల్యాణ్ సూసైడ్ చేసుకున్నట్లు తల్లిదండ్రులకు అతని రూంమేట్స్ సమాచారం అందించారు.
కల్యాణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) జన్మదినం సందర్బంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన కళ్యాణ్.. ఈ రోజు మృతి చెందాడనే వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 10 నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లి అక్కడ కార్ వాష్ క్లీనర్గా కల్యాణ్ పని చేస్తున్నాడు.
వచ్చే జీతం చాలకపోవడంతో వేరే పనిలో చేరడానికి వర్కింగ్ వీసా కోసం కళ్యాణ్ డబ్బులు కట్టాడు. వీసా ఇవ్వకుండా మోసం చేయడంతో గత కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైనట్లు కల్యాణ్ తల్లి చెప్పింది. ఈ కారణంగానే తీవ్ర మనస్తాపానికి లోనై కల్యాణ్ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కల్యాణ్ మృతదేహాన్ని జగిత్యాల తీసుకొచ్చేందుకు అతని కుటుంబం సాయం కోరింది. బతుకుదెరువు కోసం వెళ్లిన కొడుకు శవంగా మిగిలాడనే విషయం తెలిసి కల్యాణ్ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కల్యాణ్ మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు అతని కుటుంబం శత విధాలా ప్రయత్నం చేస్తోంది.
