బలూచిస్తాన్‌‌‌‌ లో ఆత్మాహుతి దాడి..మస్తుంగ్‌‌ లో చెక్‌‌ పోస్టు పై పేలుడు పదార్థాల వాహనంతో దాడి

బలూచిస్తాన్‌‌‌‌ లో ఆత్మాహుతి దాడి..మస్తుంగ్‌‌ లో చెక్‌‌ పోస్టు పై పేలుడు పదార్థాల వాహనంతో దాడి
  •     ఎదురుకాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు హతం
  •     18 మంది సైనికులను చంపామన్న బీఎల్ఏ

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌లో ఓ సెక్యూరిటీ చెక్‌‌పోస్టుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు సామాన్యులు చనిపోగా, మరో 16 మంది గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని ఎన్–25 జాతీయ రహదారిపై ఉన్న కందవా చెక్‌‌పోస్టు దగ్గర గురువారం సాయంత్రం మిలిటెంట్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని పేల్చారని బలూచిస్తాన్ పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు వెంటనే స్పందించి దాడిని తిప్పికొట్టాయని, ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారని చెప్పారు. గాయపడినవాళ్లలో ముగ్గురు ఫ్రాంటియర్ కోర్ (ఎఫ్‌‌సీ) జవాన్లు, 13 మంది సామాన్యులు ఉన్నారు. వారిలో మూడేండ్ల చిన్నారి, 12 ఏండ్ల బాలిక, పలువురు మహిళలు ఉన్నారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్లు, ఓ మసీదు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు.

18 మంది చనిపోయారన్న బీఎల్ఏ

ఈ దాడి తమదేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. తమ ఆత్మాహుతి దళం ఆర్మీ క్యాంపుపై దాడి చేసిందని, 18 మంది పాక్ సైనికులు చనిపోయారని, పేలుడు తర్వాత తమ బృందం లోపలికి చొరబడి కాల్పులు జరిపిందని ఓ వీడియో సందేశంలో పేర్కొంది. ఈ వాదనకు అధికారిక వర్గాల నుంచి గానీ, స్వతంత్ర వర్గాల నుంచి గానీ ఎలాంటి ధ్రువీకరణ లేదు. పోలీసుల ప్రకారం దాడి జరిగింది ఆర్మీ క్యాంపుపై కాదు, హైవే చెక్‌‌పోస్టుపై.. ఒక్క జవానూ చనిపోలేదు. ఆత్మాహుతి దాడి చేసింది 2022లో తమ సంస్థలో చేరిన వ్యక్తి అని బీఎల్ఏ చెప్పగా, అతడి పేరున 2024లో ఓ మిస్సింగ్ కేసు నమోదైందని, బలూచ్ యువతను బీఎల్ఏ బలవంతంగా రిక్రూట్ చేసుకుంటోందని పాక్ భద్రతా అధికారి ఒకరు ఆరోపించారు.

విదేశీ కంపెనీలకు వార్నింగ్

బలూచిస్తాన్‌‌లో ఖనిజాల తవ్వకాలు, పెట్టుబడి ప్రాజెక్టులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ రంగంలో పనిచేస్తున్న విదేశీ కంపెనీలు, పెట్టుబడిదారులు దూరంగా ఉండాలని బీఎల్ఏ హెచ్చరించింది. ప్రావిన్స్ సహజ సంపదను దోచుకునేందుకే ఈ ప్రాజెక్టులు వస్తున్నాయని ఆరోపించింది.