రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తెయ్యాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తెయ్యాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
  • రానున్న శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలి
  • లేదంటే పార్లమెంట్, ప్రధాని నివాసాలను ముట్టడిస్తాం
  • జాజుల శ్రీనివాస్ గౌడ్

బషీర్​బాగ్, వెలుగు: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్​లో బిల్లు పెట్టాలని, లేదంటే వేలాది మంది బీసీలతో పార్లమెంట్ భవనాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్​క్లబ్​లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. 

50 శాతం పరిమితి కారణంగా బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని పరిమితులు, బీసీలకు ఎందుకు అడ్డువస్తున్నాయని ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్​లో బిల్లు పెట్టకపోతే ప్రధాని నివాసం దిగ్బంధంతోపాటు కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. 

న్యాయస్థానాలు కూడా ప్రజల డిమాండ్​లను పరిగణనలోకి తీసుకొని చట్టాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కులగణన చేపట్టడం బీసీల విజయమన్నారు. ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం తమ పోరాటం సాగిందని, ఇక నుంచి చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. బీసీ నేతలు కుందాల గణేశ్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, శ్యామ్ కుర్మా, శేఖర్ సగర, మురళీ, తదితరులు పాల్గొన్నారు.

మరో మహోద్యమం చేస్తం

జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు.  జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాటం -చైతన్య అవగాహన రథయాత్రను సిటీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మరో మహోద్యమానికి సన్నద్ధం అయినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ ఉద్యమాన్ని నిర్మించి హక్కులను సాధించుకుంటామన్నారు.