
- రూ.కోట్లు వృథా.. లిఫ్ట్ లు అలంకార ప్రాయం
- చాలా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిన వైనం
- బీడు భూములకు నీళ్లు అందడం లేవు
- అన్నదాతలకు తీరని వ్యథ
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు నీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎనిమిది ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. లిప్టుల నుంచి నీరు అందక రైతుల పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. అన్ని నిర్మాణ దశలోనే ఆగిపోవడం, వాటిని పట్టించుకోకపోవడంతో రూ.కోట్ల నిధులు వృథా అవుతున్నాయి. జిల్లాలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, గుట్టలను ఆనుకుని భూములు ఉండటంతో సాగునీటికి ఇబ్బందులు ఉండేవి. ఈ సమస్యలను గుర్తించిన గవర్నమెంట్ గతంలో జిల్లాకు ఎనిమిది ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసింది.
పర్యవేక్షణ కరవై
సిర్పూర్ నియోజకవర్గంలో నిరంతరం ప్రవహించే ప్రాణహిత, పెన్ గంగా నదుల మీద సిర్పూర్, చింతలమానేపల్లి, కౌటల మండలాల్లో ఏడు, ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని కెరమెరి మండలం సుర్దాపూర్ లో ఒక ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారు. సాండ్ గాం, హుడ్కులి ఎత్తిపోతల పథకాలు మాత్రమే అంతంత మాత్రంగా పని చేస్తున్నాయి. మిగతావి పని చేయక జిల్లా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. వాటిని ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో అవి నీటిని ఎత్తిపోయడం లేదు.
- కాగజ్ నగర్ మండలం పెద్దవాగు మీద 2008 లో జంబుగ వద్ద రూ.58 లక్షలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. రెండేళ్లు నడిచిన ఈ ఎత్తిపోతల పథకం మోటార్లు చెడిపోవడంతో పని చేయడం లేదు. ఇప్పటి వరకు ఈ పథకం గురించి పట్టించుకున్ననాథుడే లేరు.
- సిర్పూర్ మండలం లోన్ వెల్లి ఎత్తిపోతల ప్రాజెక్టును వార్ధా నది పైన నిర్మించారు. 1100 ఎకరాల ఆయకట్టుకు నీరందించే మోటార్లు చెడిపోవడంతో నిరుపయోగంగా మారింది.
- చింతలమానేపల్లి మండలంలోని ప్రాణహిత నది మీద రణవెల్లి గ్రామం వద్ద 2008 లో రూ.28 కోట్లతో ఎత్తిపోతల పనులు చేపట్టారు. 4500 ఎకరాలకు సాగునీరు అందించేలా టార్గెట్ పెట్టుకున్నారు. ట్రయల్ రన్ మాత్రమే పూర్తయింది.
- కాగజ్ నగర్ మండలం అందెవెల్లి వద్ద 1989 లో రూ.28 లక్షలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం కాలువలు లేకపోవడంతో ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు అందడం లేదు. 300 ఎకరాల ఆయకట్టు భూమికి సాగు నీరు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు చుక్క నీరు అందలేదు.
- చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద రూ.17.50 కోట్లతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ద్వారా రెండు వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదేళ్లు గా ఇది నిర్మాణ దశలోనే ఉంది. ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు.
- కెరమెరి మండలంలోని సుర్దాపూర్ పెద్దవాగు వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం అలంకార ప్రాయంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా నేటికీ ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు.1998 లో రూ .3 కోట్లతో దీనిని నిర్మించారు. మోటార్లకు రిపేర్లు, పైప్ లైన్లకు మరమ్మతులు చేయక నీరు అందడం లేదు.
- ప్రాణహిత నది మీద చింతల మానేపల్లి మండలం కోర్సిని వద్ద 13 ఏళ్ల క్రితం రూ.48 కోట్లతో లిప్టు నిర్మాణం చేపట్టారు. 8 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే ఈ పథకం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.
- ఈ పథకం పూర్తి కాకపోవడంతో రైతులకు నిరాశే మిగులుతోంది.
- కౌటల మండలం తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం అలంకారప్రాయంగా ఉంది. 2006 రూ. 3 కోట్లతో దీని నిర్మాణం ప్రారంభించారు. 1000 ఎకరాలకు సాగు నీరు అందాలి. కానీ మోటార్లు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది.
బీడు భూములుగా మారుతున్నాయ్
ప్రాణహిత నది నీళ్లు సాగుకు ఇచ్చేందుకు మా ఊరి దగ్గర లిఫ్ట్ కట్టిండ్రు. ఇది కొన్ని ఏండ్లుగా పని చేస్తలేదు. దీంతో ఆయకట్టు భూములు బీడుగా మారుతున్నాయి. వర్షాకాలంలో పండే పంట తప్ప మిగతా కాలాల్లో పంటలు పండించే పరిస్థితి లేదు. సర్కారు పట్టించుకుని భూములకు నీరందేలా చేయాలి .
– జునుగరీ రేవాజి, రైతు, కౌటల