పనిచేయని ఎత్తిపోతల పథకాలు..నిలిచిన మరమ్మతులు

పనిచేయని ఎత్తిపోతల పథకాలు..నిలిచిన మరమ్మతులు

నిర్మల్,వెలుగు: బీడు భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పనిచేయడంలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 68 పథకాలుంటే... ఇందులో కనీసం సగం కూడా నీటిని ఎత్తిపోయడంలేదు. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతుల అవగాహన లోపం.. నిధుల కొరత సమస్యగా మారడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 41, మంచిర్యాలలో 13, ఆదిలాబాద్ లో ఆరు, కుమ్రంభీం జిల్లాలో  ఎనిమిది ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిలో నిర్మల్ జిల్లాలో 19 పనిచేస్తుండగా మిగతా 22 నిరుపయోగంగా మారాయి. మంచిర్యాల జిల్లాలో ఏడు, ఆసిఫాబాద్ జిల్లాలో ఐదు, ఆదిలాబాద్​లో రెండు ఎత్తిపోతల పథకాలు పనిచేయడంలేదు. 

నీరివ్వని పథకాలు...

గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చాలాచోట్ల పథకాలు నిరుపయోగంగా మారాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం సమస్యగా మారింది. నెలల తరబడి పరికరాలు, పంపులు, మోటార్లు, పైపులైన్లకు రిపేర్​చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. 

ఏళ్లుగా అందని నీరు..

నిర్మల్​జిల్లాలోని లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటి వరకు సంబంధిత శాఖ అధికారులు రైతులకు అప్పగించలేదు. అంతేకాదు పథకం రిపేర్​కు చేయక ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పథకం ప్రారంభించి పంటలకు నీరందించాలని రైతులు ఆఫీసర్లకు విన్నవించినా ఎవరూ స్పందించడంలేదు. కోట్ల రూపాయలతో నిర్మించిన పథకాలు వృధాగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత కారణంగానే నిర్వహణలేకుండా పోయాయని పలువురు పేర్కొంటున్నారు. 

రైతులకు అవగాహన కల్పిస్తాం..

ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం రైతులకు అవగాహన కల్పిస్తాం. పథకాల రిపేర్​ కోసం ప్రభుత్వానికి నివేదించాం. ఫండ్స్​రిలీజ్​కాగానే రిపేర్​చేసి రైతులకు అప్పగిస్తాం. పథకాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
- అంజా, ఇరిగేషన్​డీఈ