తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

 

  • నేటి నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ 14 గేట్లు ఎత్తి ఉంచనున్న అధికారులు
  • 120 రోజులపాటు తెరచి ఉండనున్న ప్రాజెక్టు గేట్లు
  • దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొద్దిసేపటి క్రితం ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో గేట్లు ఎత్తారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు. 120 రోజులపాటు గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏటా జులై 1వ తేదీన ప్రాజెక్టు గేట్లు తెరవాలని.. అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు ఎత్తే ఉంచాలని 2013 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పువెలువరించిన విషయం తెలిసిందే.
ఏటా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్న మహారాష్ట్ర అధికారులు.. ఇవాళ జులై 1వ తేదీ సందర్భంగా ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు, గ్రామ పంచాయతీలకు హెచ్చరికలు చేయడంతోపాటు ప్రజలందరికీ తెలిసేలా.. సైరన్.. టామ్ టామ్ ద్వారా తెలియపరిచారు. బాబ్లీ గేట్ల ఎత్తివేతతో దాదాపు 1 టీఎంసీల నీరు దిగువ గోదావరిలో వస్తుందని అంచనా. 

బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు

బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం గేట్లు తెరిచే సమయానికి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 2.7టీఎంసీలు.  కాగా ప్రస్తుతం ఇన్ ఫ్లో ఆశించిన స్థాయిలో లేదని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ద్వారా గోదావరి నదిలోకి విడుదలైన నీరు 80 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణలోని ఎస్ ఆర్ ఎస్పీకి చేరుకుంటుంది. నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుబాటులో ఉంటుంది. గోదావరిలో వరద ప్రవాహం మొదలైనందున జాలర్లతోపాటు రైతులు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.