
బంగ్లాదేశ్: అదో పెళ్లి వేడుక. అందరూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా భీకర వర్షం మొదలైంది. అనంతరం ఉరుములు, మెరుపులతో తీవ్ర రూపం దాల్చింది. ఒక్కసారిగా పెళ్లి బృందంపై పిడుగుల వర్షం పడింది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా.. పెళ్లికొడుకుతో సహా మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని షిబ్‌గంజ్ పట్టణ పరిధిలో జరిగింది. పెళ్లి కొడుకు సహా బంధువులంతా పడవలలో పెళ్లికూతురు ఇంటికి వెళ్తుండగా.. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. దాంతో వారు ఒడ్డుకు చేరుకొని షిబ్‌గంజ్ పట్టణంలోకి వెళ్దామనుకున్నారు. కానీ ఈ లోపే ఆ బృందంపై పిడుగులు పడ్డాయి.
బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాక్స్ బజార్‌లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆరుగురు రోహింగ్యా శరణార్థులు సహా దాదాపు 20 మంది మరణించారు. బంగ్లాదేశ్‌లో పిడుగుల వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. పిడుగుల వల్ల 2016లో 200 మందికి పైగా చనిపోయారు. పిడుగుపాటుకు మే నెలలో ఒకే రోజు 82 మంది మరణించారు. ఇంకా చాలా మరణాలు అధికారికంగా నమోదు చేయబడలేదు. కానీ, ఒక సంస్థ లెక్కల ప్రకారం.. ఆ సంవత్సరం కనీసం 349 మంది పిడుగుల కారణంగా మరణించారు.
కాగా.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు మెరుపుల వల్ల కలిగే మరణాల సంఖ్యను తగ్గించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో లక్షలాది చెట్లను నాటడంతో పాటు అడవుల నరికివేతను అరికట్టడం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.