కొబ్బరిచెట్టుపై పిడుగుపాటు..కాయలు బూడిదయ్యాయి

కొబ్బరిచెట్టుపై పిడుగుపాటు..కాయలు బూడిదయ్యాయి

నిన్నటి వరకు ఎండలూ..ఇవాళ మళ్లీ వర్షాలు..రాష్ట్రంలో వాతావరణం జనాలను అతలాకుతలం చేస్తోంది. ఎండల ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని..వాన వల్ల కాస్త ఉపశమనం పొందుతున్నారు అనుకుంటే ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల వాన జనాలను బెంబేలెత్తిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో భారీ గాలులతో కూడిన వాన కురిసింది. ఓ గ్రామంలో ఉరుములు మెరుపుల వాన బీభత్సం సృష్టించింది. కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. 

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కొబ్బరి మట్టలు కింద పడిపోయాయి. మంటలు చెట్టుపై వ్యాపించాయి. మంటల్లో పచ్చికొబ్బరికాయలు కాలిపోయాయి. కొబ్బరి చెట్టుపై మంటలు చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అయితే  పిడుగు పడ్డ సమయంలో చుట్టూ  ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగుపడి  దగ్ధమవుతున్న చెట్టు దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌ అయింది.