
చెట్ల కిందికి, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లొద్దంటున్న ఆఫీసర్లు
పంట పొలాల్లో పనులు చేసుకునే కూలీల మృత్యువాత
జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు
- ఆదిలాబాద్, వెలుగు : ఈనెల 10న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో భీంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ లో బస్సు కోసం చెట్టు కింద ఎదురుచూస్తున్న నిపాని గ్రామానికి చెందిన కలిమి నాగమ్మ(50)పై పిడుగుపడి తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్కు తరలిస్తుండగానే చనిపోయింది.
- ఈనెల 12న బేల మండలంలోని సాంగ్డిలో పత్తి విత్తనాలు వేస్తున్న గెడం నందిని, సోన్ కాస్ గ్రామంలో కోవ సునీత, గాదిగూడ మండలం పిప్రిలో ఓ పొలంలో పనిచేస్తున్న పెందూర్ మాదవరావు, ఆయన కూతురు సుజాతాబాయి, పెందూర్ రేణుక, మంగుబాయిపై పిడుపడటంతో ఒకే రోజు ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
అప్రమత్తతే రక్షే..
పిడుగులపై చాలా మందికి అవగాహన ఉండడం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడితే బహిరంగ ప్రదేశాల్లోనే తిరగడం, లేదంటే చెట్ల కిందకు చేరుకొని పిడుగుపాటుకు గురవుతున్నారు. కారుమబ్బులు కమ్ముకుని.. భారీ శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బయటకు ఉండకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు. చెట్లపై, విద్యుత్ స్తంభాల దగ్గర పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు నదుల్లో, వాగుల్లో, చెరువుల్లో స్నానం చేయడం మంచిది కాదు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉంటే భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
- మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవడం వల్ల పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మనుషులపై తక్కువగా ఉంటుంది.
- సెల్ ఫోన్ వినియోగించకూడదు. స్విచ్ బోర్డ్ నుంచి అన్ని కనెక్షన్లు తీసివేయాలి. షవర్ కింద స్నానం చేయడం, చేతులు, గిన్నెలు కడగడం వంటివి చేయకూడదు. ఇంటి తలుపులు, కిటికీల వద్ద నిలబడకూడదు.
పిడుగుపాటు బాధితులను పరామర్శించిన కలెక్టర్
పిప్రిలో పిడుగుపాటుకు గురైన పలువురు బాధితులు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కలెక్టర్ రాజర్షి షా వారిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బాధితులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.