కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో పోయిన నెలలో ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో మహిళలు బుధవారం రాత్రి ‘‘లైట్స్ ఔట్ మార్చ్” చేపట్టారు. రాత్రి 9 నుంచి గంట పాటు నగరంలోని అన్ని లైట్లు ఆఫ్ చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మృతురాలి ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్లు, టార్చ్ లైట్లు, కాగడాలతో ప్రదర్శన చేపట్టారు. దాదాపు నగరమంతా గంట పాటు చీకటిమయంగా మారింది. విక్టోరియా మెమోరియల్, రాజ్‌భవన్‌తో పాటు అన్ని ఇండ్లల్లో, షాపుల నిర్వాహకులు కూడా గంట పాటు లైట్లు ఆఫ్ చేసి మహిళలు చేపట్టిన నిరసన ర్యాలీకి మద్దతు ప్రకటించారు.
గవర్నర్ సీవీ ఆనంద బోస్ కూడా రాజ్‌భవన్‌లో లైట్స్ ఆర్పేసి క్యాండిల్స్ వెలిగించారు. ‘‘వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు.. చీకటే అండగా నిలుస్తుంది’’ అని గవర్నర్ అన్నారు. కోల్‌కతా పోలీసులు.. కేసును సీబీఐకి అప్పగించి 23 రోజులు దాటినా ఎలాంటి పురోగతి లేదని మహిళలు మండిపడ్డారు. సుప్రీం కోర్టు విచారణను స్పీడప్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
‘లైట్స్ ఔట్ మార్చ్’లో భాగంగా హౌరా, సాల్ట్ లేక్ వద్ద భారీ సంఖ్యలో మహిళలు, స్టూడెంట్లు, మెడికోలు, డాక్టర్లు, అమ్మాయిలు చేరుకుని క్యాండిల్స్ వెలిగించారు. శ్యాం బజార్ ఫై పాయింట్ క్రాసింగ్, మౌలాలీ, న్యూ టౌన్ బిస్వా బంగ్లా గేట్, రష్బిహారీ క్రాసింగ్, బెహలా, గరియా, హజారా క్రాసింగ్‌వద్ద కూడా మహిళలు టార్చ్లైట్లు, ఫోన్ లైట్లతో నిరసన తెలిపారు. కాగా, ర్యాలీలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్, గరియాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
బీజేపీ రాజకీయం చేస్తున్నది: టీఎంసీ
ట్రెయినీ డాక్టర్ మృతి ఘటనను అడ్డం పెట్టుకుని బీజేపీతో పాటు కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని టీఎంసీ నేత, మంత్రి శశి పంజా మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫ్యామిలీకి న్యాయం జరగాలని బీజేపీ కోరుకోవడం లేదని విమర్శించారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బాధితురాలికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై సెప్టెంబర్ 18లోగా నివేదిక ఇవ్వాలని కలకత్తా హైకోర్టు గురువారం సీబీఐని ఆదేశించింది. సైబర్ క్రైమ్ కోణంలోనూ కేసును దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలంటూ హైకోర్టును పిటిషనర్ కోరారు. సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ కాకుండా ఏం చేస్తారని సీబీఐ తరఫున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ అశోక్ కుమార్ చక్రవర్తిని హైకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్య ప్రశ్నించారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
డబ్బు ఆశ చూపి.. అంత్యక్రియలకు తొందర పెట్టారు: మృతురాలి తండ్రి
కోల్‌కతా సీనియర్ పోలీస్ అధికారి ఒకతను తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడని మృతురాలి పేరెంట్స్ ఆరోపించారు. పోస్టుమార్టం తర్వాత వెంటనే డెడ్‌బాడీకి అంత్యక్రియలు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. అంత్యక్రియలకు ఆలస్యం చేయకుండా ఉండేందుకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తాము నిరాకరించినట్లు చెప్పారు. ‘‘లైట్ ఔట్ మార్చ్”లో ట్రెయినీ డాక్టర్ పేరెంట్స్ కూడా పాల్గొన్నారు.
‘‘మా కూతురు చనిపోయినప్పటి నుంచి పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. డెడ్‌బాడీ చూపించకుండా మూడు గంటలు వెయిట్ చేయించారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి తీసుకెళ్లే టైమ్లో కూడా పోలీస్ స్టేషన్లో ఇలాగే చేశారు. డెడ్ బాడీ అప్పగిస్తున్నప్పుడు ఓ పోలీస్ అధికారి మాకు డబ్బిచ్చాడు. మేము దాన్ని వెంటనే తిరస్కరించాం’’అని మృతురాలి తండ్రి తెలిపారు.