బొల్లం వర్సెస్ సీనియర్లు.. కోదాడ బీఆర్‌‌‌‌ఎస్‌‌లో తారస్థాయికి చేరిన అసమ్మతి

బొల్లం వర్సెస్ సీనియర్లు.. కోదాడ బీఆర్‌‌‌‌ఎస్‌‌లో తారస్థాయికి చేరిన అసమ్మతి
  • మంత్రి జగదీశ్‌‌ రెడ్డి బర్త్‌‌డే వేడుకల్లో బయటపడ్డ విభేదాలు
  • సిట్టింగ్‌‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటున్న నేతలు
  • మహిళా ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆరోపణ

సూర్యాపేట, కోదాడ, వెలుగు:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్‌‌‌‌ఎస్‌‌లో అసమ్మతి తారస్థాయికి చేరింది.  ముఖ్యంగా పార్టీలోని సీనియర్లు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌కు పడడం లేదు.  ఎమ్మెల్యే వైఖరి నచ్చని వాళ్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  దశాబ్ది ఉత్సవాలు, మంత్రి జగదీశ్‌‌ రెడ్డి జన్మదిన వేడుకలను వేదికగా చేసుకొని విమర్శలు గుప్పించారు.  గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్‌‌ వచ్చినా కష్టపడి గెలిపించామని, ఆయన మాత్రం తమను పార్టీకి దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు  ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.  ఈ సారి క్యాండిడేట్‌‌ను మార్చాలని,  సిట్టింగ్‌‌కు టికెట్‌‌ ఇస్తే తాము సహకరించబోమని హైకమాండ్‌‌ను హెచ్చరిస్తున్నారు. 

సీనియర్లను దూరం పెట్టిన ఎమ్మెల్యే

2018లో కోదాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌ మొదట్లో పార్టీ సీనియర్లతో బాగానే ఉన్నారు.  తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్లను కాదని, తనవారికే టికెట్లు ఇవ్వడంతో విభేదాలు ప్రారంభమయ్యాయి.  దీంతో  మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌‌‌‌రావు, పార్టీ రాష్ర్ట కార్యదర్శి ఎర్నేని బాబు, డీసీసీబీ మాజీ చైర్మన్‌‌‌‌ పాండురంగారావు, నియోజకవర్గ మాజీ ఇన్‌‌చార్జి ‌‌శశిధర్‌‌‌‌రెడ్డి ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు.  ఈ క్రమంలోనే చిలుకూరు, అనంతగిరి మండల పరిషత్‌‌ ‌‌ఎన్నికల్లో ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులు కాకుండా వేరే అభ్యర్థులను ఎంపీపీలుగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే తన అనుచరులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ రెండు పరిణామాలు ఎమ్మెల్యే,  సీనియర్ల మధ్య మరింత దూరాన్ని పెంచింది. దీంతో ఎవరికి వారే అన్నట్లు పార్టీ కార్యక్రమాలు చేపట్టడం మొదలు పెట్టారు.  

మహిళా ప్రజాప్రతినిధులకు అవమానాలు 

మహిళా ప్రజాప్రతినిధులకు పలుమార్లు అవమానాలు జరిగినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం కూడా సీనియర్ల కోపానికి కారణమైంది. కోదాడ మున్సిపల్‌‌ ‌‌చైర్‌‌‌‌పర్సన్‌‌ ‌‌వనపర్తి శిరీష స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొందరు ప్రజాప్రతినిధులు తనను అవమానించేలా వ్యవహరించారని, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.  ఈ ఘటన అనంతరం మోతె ఎంపీపీ, జడ్పీటీసీలు ఎమ్మెల్యే వైఖరి నచ్చలేదని అసమ్మతి నాయకుల పక్షాన చేరారు.  తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యలకు నడిగూడెం మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఎంపీపీ యాతాకుల జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

 దళిత మహిళను అయినందునే తనను అవమానపరిచారని, అయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఇటీవల మంత్రి జగదీశ్ ‌‌రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మహిళా ప్రజాప్రతినిధులు, అసమ్మతి నేతలు ఎమ్మెల్యే టార్గెట్‌‌గా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్‌‌కు టికెట్‌‌ ఇస్తే సహరించేది లేదని  స్పష్టం చేశారు.  ఈ విషయన్ని ఇప్పటికే  మంత్రి జగదీశ్‌‌ ‌‌రెడ్డికి చెప్పామని, సీఎం కేసీఆర్‌‌‌‌, పార్టీ వర్కింగ్‌‌ ‌‌ప్రెసిడెంట్‌‌ ‌‌కేటీఆర్‌‌ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.  కాగా, ఈ పంచాయితీని ఇప్పటికే టికెట్‌‌ ఆశిస్తున్న నేతలు ఆవకాశంగా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.