పైప్​లైన్ల రిపేర్లంటూ.. వాటర్ ​బంద్

పైప్​లైన్ల రిపేర్లంటూ.. వాటర్ ​బంద్

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఫ్రీ వాటర్ స్కీమ్ అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, మరోవైపు   కాలనీల్లో తరచూ నీటి సరఫరా బంద్​పెడుతోంది. ఐదారు రోజులపాటు నీళ్లు రావట్లేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాటర్ సప్లై నిలిపేస్తుండగా, బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. రిపేర్ల పేరిట వాటర్ బోర్డు సేవలకు అంతరాయం ఏర్పడుతుండగా జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. బస్తీల్లో ట్యాంకర్లు వస్తున్నా, కాలనీల వాసులకే ప్రాబ్లమ్​గా మారింది. సిటీలో రోజూ 375 ఎంజీడీల నీటిని శివారు ప్రాంతాలకు కూడా  అందిస్తున్నామని వాటర్ బోర్డు లెక్కల్లో చెబుతుంది. నీటి సరఫరా మాత్రం రెగ్యులర్ గా కొనసాగిం చడంలేదు. ఓల్డ్ సిటీ ప్రాంతాలతో పాటు ఇన్నర్ రింగు రోడ్డు అవతలి ఏరియాల్లోని జనాలు వాటర్​ప్రాబ్లమ్​ఎదుర్కొంటున్నారు. 


ఒక్కసారి నిలిపివేస్తే..


నెలలో రెండు నుంచి నాలుగు సార్లు వాటర్ బోర్డు అధికారులు రిపేర్లంటూ నీటి సరఫరాను బంద్​పెడుతున్నారు. పైపు లైన్ల రిపేర్లు వచ్చిన ప్రాంతాల్లో ముందస్తుగా చెబుతున్నా, దీంతో పాటే ఇతర ప్రాంతాల్లో కూడా నిలిపేస్తున్నారు. ఒక్కసారి నీటి సరఫరా నిలిపేస్తే ఏకంగా వారం నుంచి 10 రోజుల వరకు ఎదురు చూడాల్సి వస్తోందని మాదన్నపేట్ సెక్షన్ కు చెందిన నజీబ్ సయ్యద్ ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభాకు కనీసం 450–550 ఎంజీడీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందనే అంచనాలు. అధికారులు మాత్రం 375–400 ఎంజీడీలకు మించి సప్లై చేయడంలేదు.  రిపేర్లంటూ నిర్వహణ వ్యయం తగ్గించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం పైపు లైన్ల మరమ్మతులు, లో ప్రెజర్ వంటి సమస్యలను చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 

5 సెక్షన్ల పరిధిలోనూ ప్రాబ్లమ్​


ఇటీవల ముషీరాబాద్ పరిధిలోని వాటర్ ట్యాంకర్ లో డెడ్ బాడీ రావడంతో మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు వాటర్​బోర్డు అధికారులు ప్రకటించారు. ఆ పరిధిలోనే కాకుండా బర్కత్ పురా సెక్షన్ వరకు నీటి సప్లైని బంద్​పెట్టారు. దీనిపై బర్కత్ పురాకు చెందిన విశాల్ ట్విట్టర్ లో వాటర్ బోర్డు అధికారులకు కంప్లయింట్​చేశాడు. తద్వారా తెలిసినది ఏంటంటే నెలలో సిటీలోని 5 సెక్షన్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటున్నట్టు తెలిసింది. వినియోగదారుల కంప్లయింట్లపై వారం  పది రోజుల వరకు అధికారులు దృష్టి పెట్టడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి వాటర్​సప్లై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతేడాది కాలంగా ఫ్రీ వాటర్ స్కీమ్​అమలవుతుండగా నీటి సరఫరా తరచుగా ఆగిపోతుందని జనాలు పేర్కొంటున్నారు.