ప్రాణాంతక బ్యాక్టీరియాకు చెక్ పెట్టేందుకు.. త్వరలో బెటర్ యాంటీబయోటిక్స్

ప్రాణాంతక బ్యాక్టీరియాకు చెక్ పెట్టేందుకు.. త్వరలో బెటర్ యాంటీబయోటిక్స్
  • ప్రాణాంతక బ్యాక్టీరియాను అడ్డుకునే పద్ధతిని గుర్తించిన సీసీఎంబీ
  • బ్యాక్టీరియాలో తప్పులను పీజీఈఎఫ్​ ఎంజైమ్​సరిదిద్దుతున్నట్టు తేల్చిన సైంటిస్టులు
  • సెల్​వాల్​లో తప్పుడు అమైనో యాసిడ్స్​ చేరకుండా బ్యాక్టీరియాకు సంకేతాలు
  • దాని ఆధారంగా కొత్త యాంటీబయోటిక్స్​ను అభివృద్ధి చేసేందుకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: యాంటీబయోటిక్స్​కు బ్యాక్టీరియాలు రెసిస్టెన్స్​ను సంతరించుకుంటున్నాయి. దీంతో మందులకు లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. మరోవైపు కొత్త యాంటీ బయోటిక్​లు రాక దశాబ్దాలవుతున్నాయి. దీంతో కొత్త యాంటీబయోటిక్స్​పై సైంటిస్టులు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్​లోని సెంటర్​ ఫర్​ సెల్యులార్​ అండ్​ మాలిక్యులర్​ బయోలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు చేసిన ఓ తాజా పరిశోధన.. కొత్త యాంటీబయోటిక్ ​ల తయారీపై ఆశలు రేకెత్తిస్తున్నది. 

మెరుగైన, సమర్థవంతమైన యాంటీబయోటిక్స్​ను అభివృద్ధి చేసేందుకు ఆ అధ్యయనం తోడ్పడుతుందన్న ఆశాభావం కలుగుతున్నది. బ్యాక్టీరియా సెల్​ వాల్​ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే పెప్టిడోగ్లైకాన్ ​ ఎడిటింగ్​ ఫ్యాక్టర్​(పీజీఈఎఫ్) అనే ఎంజైమ్​ను టార్గెట్​ చేస్తే, కొత్త యాంటీయోటిక్స్​ను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. 

సీసీఎంబీకి చెందిన సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్  మంజులా రెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. వివిధ బ్యాక్టీరియాల్లోని సెల్​ వాల్​ నిర్మాణంలో జరిగే తప్పులను పీజీఈఎఫ్​ అనే ఎంజైమ్  ప్రూఫ్ రీడింగ్​ చేసి.. ఆ తప్పులను సరిదిద్ది బ్యాక్టీరియాను స్ట్రాంగ్​ 
చేస్తుందని తేల్చారు. 

అమైనో యాసిడ్స్​కు బదులు..

మామూలుగా బ్యాక్టీరియా సెల్​వాల్​ వివిధ రకాల షుగర్, అమైనో యాసిడ్లతో నిర్మితం అవుతుంది. ఈ అమైనో యాసిడ్ల​ చెయిన్​లో అత్యంత ముఖ్యమైనది ఎల్​అలనైన్. అయితే, ఒక్కోసారి సెల్​ వాల్​ నిర్మాణంలో బ్యాక్టీరియా పొరపాటున ఎల్​ అలనైన్​కు బదులు దాని నిర్మాణాన్ని పోలి ఉండే ఎల్​సెరీన్​ లేదా గ్లైసిన్​ అనే అమైనో యాసిడ్లను సెల్​వాల్​లో యాడ్​ చేస్తుంటుంది. 

ఈ ఎల్​సెరీన్​ను యాడ్​ చేయడం ద్వారా బ్యాక్టీరియా కణత్వచం బలహీనమై యాంటీబయోటిక్స్​ పనిని సులువు చేస్తుంటుంది. ఇలాంటి తప్పులు జరగకుండా చూసేందుకు బ్యాక్టీరియాలోనే ఈ పీజీఈఎఫ్​ ఎంజైమ్​.. ప్రూఫ్​ రీడ్​ చేసి ఆ తప్పును సరిదిద్దేలా బ్యాక్టీరియాకు సంకేతాలు ఇస్తుంటుంది. ‘‘హై రెజల్యూషన్​ మాస్​ స్పెక్ట్రోమెట్రీ, కాంబినేషన్​ను ఉపయోగించి బ్యాక్టీరియాలో పీజీఈఎఫ్​ పాత్ర ఏంటో గుర్తించాం. 

తప్పుడు అమైనో యాసిడ్స్​ను పీజీఈఎఫ్​ గుర్తించి తొలగిస్తుంది. దాని స్థానంలో సెల్​వాల్​లో సరైన​అమైనో యాసిడ్​ను చేర్చుకునేలా బ్యాక్టీరియాకు సంకేతాలను ఇస్తున్నట్టు గుర్తించాం’’ అని రీసెర్చ్​లో పాల్గొన్న మరో సైంటిస్టు డాక్టర్​ శాంభవి గర్డే తెలిపారు. 

యాంటీబయోటిక్స్​ టార్గెట్​ అదే..

ఇప్పుడున్న యాంటీబయోటిక్స్​ టార్గెట్​.. బ్యాక్టీరియాలోని సెల్​ వాలే. సెల్​వాల్​ సింథసిస్​ను నిరోధించడం ద్వారా హానికారక, ప్రాణాంతక బ్యాక్టీరియాకు యాంటీబయోటిక్​లు చెక్​ పెడుతుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో బ్యాక్టీరియాకు రెసిస్టెన్స్​ పెరిగిపోతున్నట్టు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలోనే బ్యాక్టీరియా వృద్ధిలో కీలకమైన పీజీఈఎఫ్​ లాంటి ఎంజైమ్​లను టార్గెట్​ చేసుకుంటే కొత్త యాంటీబయోటిక్​ను తయారు చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. పీజీఈఎఫ్​ లాంటి ఎంజైమే మనుషుల్లోనూ ఉన్నట్టు సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. ఎల్ఏసీసీ1గా పిలుస్తున్న ఆ ఎంజైమ్​కు వివిధ ఆటోఇమ్యూన్​ డిజార్డర్స్​తో సంబంధం ఉందని  గుర్తించారు. దీని ద్వారా మన రోగనిరోధక వ్యవస్థ హైపర్​ యాక్టివేట్​ అవుతున్నట్టు చెబుతున్నారు.

 ప్రస్తుతానికి ఎల్ఏసీసీ1 పనితీరుపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా.. బ్యాక్టీరియాకు మన రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరులో ఎల్ఏసీసీ1 పాత్రను తేల్చవచ్చని, భవిష్యత్తులో ఆటోఇమ్యూన్​ డిజార్డర్లకూ మరింత సమర్థవంతమైన చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.