టీఎస్​పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్​ క్లియర్

టీఎస్​పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్​ క్లియర్
  • చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్​ ఆమోదం 
  • ఇంకా పదవుల్లోనే కొసాగుతున్న ఇద్దరు మెంబర్లు
  • త్వరలో కొత్త చైర్మన్​ సహా సభ్యుల నియామకం
  • యూపీఎస్సీ తరహాలో టీఎస్​పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కారు రెడీ
  • కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్​మెంట్లు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్​ క్లియర్​ అయింది. కమిషన్ చైర్మన్  జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యులు ఆర్​.సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. అయితే.. మరో ఇద్దరు సభ్యులు సుమిత్రానంద్, అరుణకుమారి మాత్రం రాజీనామా చేయలేదు. వారు పదవుల్లోనే కొనసాగుతున్నారు. చైర్మన్​తోపాటు ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్​ ఆమోదం తెలుపడంతో కొత్త బోర్డు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల టైమ్​లో హామీ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఇదే అంశంపై చర్చించింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్​పీఎస్సీని తీర్చిదిద్దుతామని, రాజకీయాలకు తావులేకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మన్​ మనోజ్​ సోనిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి.. ఇదే అంశంపై మాట్లాడారు. టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు మనోజ్​ సోని సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు టీఎస్​పీఎస్సీ చైర్మన్​తోపాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలకు ఆమోదం లభించడంతో కమిషన్​లో కీలక మార్పులు జరగనున్నాయి. 

కొత్త చైర్మన్​గా ఎవరిని నియమిస్తారన్న చర్చ ఇటు పొలిటికల్​ సర్కిల్స్​తో పాటు అటు నిరుద్యోగుల్లోనూ కొనసాగుతున్నది. లీకేజీలతో తీవ్ర వ్యతిరేకతగత ప్రభుత్వ హయాంలో టీఎస్​పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు లీక్ కావడం, రాసిన ఎగ్జామ్స్ రద్దు కావడంతో కమిషన్​పై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గతేడాది కాలంలో 26 నోటిఫికేషన్లను కమిషన్​ రిలీజ్ చేయగా, దాంట్లో గ్రూప్1, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్​ అయ్యాయి. వాటిని రద్దు చేశారు. రెండోసారి గ్రూప్ 1 పరీక్షను కమిషన్​నిర్వహించినప్పటికీ తన నిబంధనలను తానే పాటించలేదు.

 దీంతో ఆ ఎగ్జామ్​ను హైకోర్టు రద్దు చేసింది. నాడు టీఎస్​పీఎస్సీ చైర్మన్​ సహా అధికారుల తీరును, అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిరుద్యోగుల ఆందోళనలకు కాంగ్రెస్  మద్దతిస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని అప్పట్లో ప్రకటించింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈనేపథ్యంలో టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనపై సర్కారు దృష్టి సారించింది. 

కొత్త సర్కారు రాగానే రాజీనామాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, టీఎస్​పీఎస్సీలో  రాజీనామాలు మొదలయ్యాయి. 2021 మే 21న  చైర్మన్​గా జనార్దన్​రెడ్డి, మెంబర్లుగా బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రానంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. కాగా, జనార్దన్ రెడ్డికి 2024 నవంబర్ వరకూ చైర్మన్​ గా కొనసాగేందుకు చాన్స్ ఉండే. కానీ, సర్కారు మారిన వారంలోనే  ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. గత నెల11న సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిసి.. అదే రోజు సాయంత్రం తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

 రాజీమానా లేఖను రాజ్ భవన్​లో అందించారు.  ఆ తర్వాతి మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డిని మిగిలిన ఐదుగురు సభ్యులు కలిశారు. రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో లింగారెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రాజీనామా లేఖలను రాజ్ భవన్​కు పంపించారు. కాగా, మరో ఇద్దరు సభ్యులు సుమిత్రానంద్, అరుణకుమారి మాత్రం ఇంకా రాజీనామాలు చేయలేదు. 

నా దగ్గర లేట్ కాలే.. ఒక్కరోజులో ఆమోదించిన: గవర్నర్

టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మెంబర్లు రవీందర్ రెడ్డి, లింగారెడ్డి, సత్యనారాయణ రాజీనామాలు ఆమోదించే ప్రాసెస్​లో రాజ్ భవన్​లో లేట్ కాలేదని ఒక్క రోజులోనే ఆమోదం తెలిపినట్లు గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. రాజీనామాల ఆమోదానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలపడంతో, లీగల్ ఓపీనియన్ తీసుకొని ఆమోదించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. 

కొత్త చైర్మన్ ఎవరో..?

టీఎస్​పీఎస్సీకి కొత్త చైర్మన్​గా ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది. కమిషన్​లో చైర్మన్​తోపాటు పది మంది సభ్యుల నియామకానికి చాన్స్​ ఉంది. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనేదానిపై ఒకటీ, రెండ్రోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్​పీఎస్సీ చైర్మన్​ పోస్టుకు, మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.హెచ్​సీయూలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ తో పాటు ఓయూ, జేఎన్టీయూలోని ఒక్కరిద్దరు ప్రొఫెసర్లు చైర్మన్ పోస్టు కోసం ట్రై చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్​ను చైర్మన్​గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కొత్త కమిషన్ రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుంది.