లింగంపేట,వెలుగు: ఊపిరితిత్తుల్లో హోల్బ్లాక్ అయి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వైద్యఖర్చుల కోసం లింగంపల్లి గ్రామస్తులు రూ. లక్ష సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన బందెల శేఖర్ కుమార్తె రుచిత (20 నెలలు) అనారోగ్యానికి గురికాగా మంగళవారం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో హోల్ బ్లాక్ అయిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.3లక్షలు ఖర్చవుతాయని చెప్పారు.
దీంతో అయోమయానికి గురైన తండ్రి శేఖర్ పాప వైద్యఖర్చుల విషయాన్ని గ్రామ సర్పంచ్ గొల్ల ప్రత్యూష సాయిరాంకు ఫోన్లో విన్నవించారు. స్పందించిన సర్పంచ్ గ్రామస్తులతో చర్చించి రూ.లక్ష వరకు చందాలు చేసి చిన్నారి తల్లికి అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు శభాష్ లింగంపల్లి అంటూ అభినందనలు తెలుపుతున్నారు. నగదు అందించిన వారిలో ఉపసర్పంచ్సంతోష్, బానుచందర్గౌడ్,లక్ష్మణ్, లింగు ఆనంద్, నవీన్, అనిల్ తదితరులు ఉన్నారు.
