ఇండియా, అమెరికా మధ్యలో చైనా!..మూడు దేశాల మధ్య మందుల లింక్

ఇండియా, అమెరికా మధ్యలో చైనా!..మూడు దేశాల మధ్య మందుల లింక్

ప్రపంచవ్యాప్తంగా సప్లై అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్ సీక్యూ) ట్యాబ్లెట్లలో 70% ఇండియా నుంచే వెళ్తుంటాయి. కరోనాకు ట్రీట్ మెంట్ కోసం ఇండియా ఈ మందుల ఎగుమతిని ఆపేయడంతో అమెరికాపైనే ఎక్కువగా ఎఫెక్ట్ పడింది. అనేక దేశాలు ఈ మందు కోసం గగ్గోలు పెట్టాయి. ఇండియా నుంచి అమెరికాతో పాటు పలు దేశాలకు మందులు అందాలంటే.. అంతకంటే ముందు చైనా నుంచి ఇండియాకు సప్లై చైన్ సజావుగా సాగి, ముడి పదార్థాలు రావాల్సి ఉంటుంది. అందుకే.. చైనాపై డిపెండెన్సీని ఎలా తగ్గించుకోవాలా? అని ఇండియా ఆలోచిస్తుంటే.. అటు చైనా, ఇటు ఇండియాపై ఆధారపడకుండా ఎలా మందులు తయారు చేసుకోవాలా? అని అమెరికా ఆలోచిస్తోంది. ఎప్పటినుంచో ఇండియా, అమెరికా స్వదేశీ మందుల గురించి ఆలోచిస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు కరోనా.. ఈ రెండు దేశాల కండ్లు తెరిపించింది!

68% ముడి పదార్థాలు చైనా నుంచే..

ఫార్మా ఇండస్ట్రీలో మందులను తయారు చేసేందుకు కావల్సిన ముడి పదార్థాలను ‘యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రీడియెంట్స్ (ఏపీఐలు)’గా పిలుస్తారు. మనదేశంలో మందుల తయారీకి కావలసిన మొత్తం ఏపీఐలలో 68% చైనా నుంచే దిగుమతి అవుతున్నాయట. అందుకే చైనా నుంచి సప్లై చైన్ లో ఏమాత్రం ఆటంకం వచ్చినా..  కరోనా లాంటి విపత్తులో సప్లై ఆగి.. అతిపెద్ద సమస్యకు దారితీస్తుందని అంటున్నారు. ఇక అమెరికాలో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 90% వరకూ జనరిక్ మందులే ఉంటాయట. అమెరికన్లు వేసుకునే ప్రతి మూడు ట్యాబ్లెట్లలో ఒకటి ఇండియాలో తయారైన జనరిక్ మెడిసినే ఉంటుందట. ఏప్రిల్ 2020లో కాన్ఫెడరేషన్ ఆఫ్​ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), కేపీఎంజీ సంస్థల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గ్లోబల్ ఫార్మాలో ఇండియా కింగ్

ప్రపంచ ఫార్మా  రంగంలోనే అతి చౌకగా మందులు తయారు చేసే కంపెనీలు ఉన్నది మనదేశంలోనే. అందుకే గ్లోబల్ ఫార్మాలో కింగ్ గా ఇండియా అవతరించింది. ఇందిరా గాంధీ హయాంలోనే పునాదులు పడ్డాయి. 1970లో ఆమోదించిన పేటెంట్ యాక్ట్ లో ఫార్మాకు సంబంధించిన కీలక అంశాలను చేర్చింది. ఏదైనా ఒక మందును తయారు చేసే ప్రాసెస్ కు మాత్రమే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందని, ఆ మందులోని పదార్థాలకు కాదని ఈ చట్టం తేటతెల్లం చేసింది. దీంతో మన దేశంలో జనరిక్ మందుల తయారీకి మార్గం సుగమం అయింది.  ఇంపోర్ట్ చేసుకునే ఖరీదైన మందులు మన దేశ ప్రజలకు ఎప్పుడూ భారమే అవుతాయని భావించిన ప్రభుత్వాలు దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని ఎప్పుడో గుర్తించాయని, ఆయా ప్రభుత్వాల చర్యల ఫలితంగానే మన ఫార్మా ఎదిగిందని ఏసీజీ వరల్డ్ వైడ్ ఫార్మా కంపెనీ ఎండీ కరణ్ సింగ్ చెప్తున్నారు.

కరోనాతో కలకలం

జనవరిలో కరోనా కేసులు పెరగగానే చైనా లాక్ డౌన్ అయిపోయింది. దేశంలోని ఏపీఐ ఫ్యాక్టరీలూ మూతపడ్డాయి. దీంతో ముడి పదార్థాలు అందక ఇండియన్ ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు షురువయ్యాయి. చాలా కంపెనీలు మనదేశంలోని లోకల్ వ్యాపారుల నుంచి ఎక్కడ దొరికితే అక్కడ, ఎంతకంటే అంతకు ఏపీఐలను కొన్నాయి. ఇవి చాలక కొన్ని కంపెనీలు ఏకంగా ప్రైవేట్ విమానాల్లో ముడిపదార్థాలు తెప్పించుకునేందుకూ సిద్ధమయ్యాయి. మార్చిలో చైనాలో లాక్ డౌన్ సడలించినా, మిగతా దేశాల బోర్డర్లన్నీ బంద్ అయిపోవడం, ఫ్లైట్లు రద్దవడంతో దిగుమతులకు చాన్స్ లేకుండా పోయింది. కరోనా వల్ల చైనా నుంచి ఏపీఐల ఇంపోర్ట్స్ మార్చి నెలలోనే 40% తగ్గిపోయాయని కంపెనీలు చెప్తున్నాయి.

30% తక్కువ ధరకే చైనా ఏపీఐలు

మందులను మన కంపెనీలు చౌకగా తయారు చేస్తుంటే.. ఆ మందులకు కావల్సిన ముడి పదార్థాలను చైనా కంపెనీలు చౌకగా తయారు చేస్తున్నాయి. మనదేశంలో కన్నా 30% తక్కువ ధరకే చైనా నుంచి ఏపీఐలు వస్తున్నాయి. చైనా సర్కారు ఆ దేశ కంపెనీలకు భారీగా రాయితీలు ఇస్తుండటమే ఇందుకు కారణమని చెప్తున్నారు. భారీ రాయితీల వల్ల ఆ దేశంలో దాదాపు 7 వేల ఏపీఐ కంపెనీలు వెలిశాయి. పెద్ద ఎత్తున ఏపీఐలను తయారు చేయడం వల్ల చాలా తక్కువ ధరకే వాటిని అమ్మగలుగుతున్నాయి. అదే మనదేశంలో మాత్రం 1500 ఏపీఐ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి.

అమెరికా టార్గెట్.. 2023

అమెరికా కూడా ప్రస్తుతం ఇండియా నుంచి 18% ఏపీఐలు, చైనా నుంచి 13%, ఈయూ నుంచి 26%, మిగతా దేశాల నుంచి 15% ఏపీఐలను దిగుమతి చేసుకుంటోంది. జనరిక్ మందులైతే ఎక్కువగా ఇండియా నుంచే వెళుతున్నాయి. కరోనా వల్ల హెచ్ సీక్యూకు ఇబ్బందులు వచ్చినందున దేశంలోనే మందుల తయారీ కెపాసిటీని పెంచుకోవడానికి ఆ దేశం ఆలోచనలో పడింది. మొత్తానికి 2023 నాటికి చైనా నుంచి మందుల కొనుగోలుకు ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా భావిస్తోంది. ఇండియా నుంచి మందుల కొనుగోలు అవసరాన్నీ లేకుండా చూసుకోవాలనీ ఆలోచిస్తోంది.

మనకు పదేండ్లు పట్టొచ్చు.. 

ప్రస్తుతానికి, చైనా ఏపీఐలు లేకపోతే మనదేశం మరీ ఇబ్బందుల్లో పడకపోయినా, కరోనాకు మందు కనిపెడితే.. దాని తయారీకి ఏపీఐలు పెద్ద ఎత్తున అవసరమైతే అప్పుడు అసలు పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. మనదేశం సొంతంగానే ఏపీఐ ఉత్పత్తిని గణనీయంగా పెంచుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికిప్పుడు చైనా సప్లై చైన్ కు ప్రత్యామ్నాయంగా మారతాయన్న గ్యారంటీ లేదు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇక్కడే ఏపీఐ ఉత్పత్తి సాధించాలంటే కనీసం మరో పదేళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో.. ‘‘బై అమెరికన్” అంటారు. మన  ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏమో.. ‘‘మేక్ ఇన్ ఇండియా” అంటారు.. కానీ.. అమెరికాకు ఇండియా మందులు కావాలె.. ఇండియాకు చైనా ముడి పదార్థాలు కావాలె!  చైనా నుంచి సప్లై చైన్ ఆగిపోతే.. ఇండియాలో మందుల తయారీ కష్టం.. ఇండియాలో మందుల తయారీ తగ్గిపోతే.. అమెరికాకు మందుల కొరత తథ్యం!

 కరోనా కండ్లు తెరిపించింది

ఏపీఐల కోసం చైనా మీద ఆధారపడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది కరోనా విపత్తు మరోసారి చూపించింది. ఒకరకంగా ఇది మన కండ్లు తెరిపించింది. దీంతో మన ప్రభుత్వం గత కొన్నేండ్లలో చేపట్టిన చర్యల కంటే గత కొన్ని వారాల్లోనే ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంది. కానీ ఇప్పటికిప్పుడు ప్రయత్నాలు ప్రారంభించినా, చైనా ఏపీఐలపై ఆధారపడకుండా ఉండడానికి మరో పదేళ్ల సమయం పట్టొచ్చు.

– దినేశ్ దువా, ఫార్మెక్సిల్ చైర్మన్