గండిపేట, వెలుగు: ట్యాక్స్చెల్లించకుండా రాష్ట్రానికి తీసుకువచ్చిన రూ.1.83 కోట్ల విలువైన లిక్కర్బాటిళ్లను పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని రోడ్ రోలర్ తో ధ్వంసం చేయించారు. గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఎయిర్ పోర్టు ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చిన ట్యాక్స్ చెల్లించని 10,222 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో శాంపిల్స్ పోగా మిగిలిన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.1,83,42,763 ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, పర్యాటక ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చినా, రవాణా చేసినా, అమ్మినా, వినియోగించినా నేరమని తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. తక్కువ ధరకు వస్తుందన్న భ్రమలో కోనుగోలు చేసే సుంకం చెల్లించని మద్యం వల్ల ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ మద్యం దుకాణాలలో మాత్రమే మద్యాన్ని కోనుగోలు చేయాలని తెలిపారు.