పుణ్య క్షేత్రంలో పాపపు పనులా?

పుణ్య క్షేత్రంలో పాపపు పనులా?
  • దేవప్రయాగ్ లో లిక్కర్ ప్లాంట్ పై వివాదం
  • లైసెన్స్ రద్దు చేయాలని స్థానికుల ఆందోళన

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లా దేవప్రయాగ్ లో లిక్కర్ బాట్లింగ్ ప్లాంట్ పై  వివాదం చెలరేగింది. భాగీరథి, అలకనందా కలిసి గంగా నదిగా ఏర్పడే పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారంటూ స్థానికులు, మతపరమైన సంస్థలు ఆందోళనకు దిగాయి. వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. 2016లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ ప్లాంట్ ఏర్పాటుకు విందేశ్వరి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కు లైసెన్స్ జారీ చేసింది. ఈ మధ్యనే ఆ సంస్థ పనులు ప్రారంభించడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

“హిందువులు పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో లిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం పాపం కాదా” అని గంగా మహాసభా జనరల్ సెక్రటరీ స్వామి కాశి జీతేంద్ర సరస్వతి ప్రశ్నించారు. టూరిజం, తీర్థయాత్రలకు చాలా తేడా ఉందని, అధికారులు వాటిని అర్థం తెలుసుకోవాలని సూచించారు. వెంటనే లిక్కర్ ప్లాంట్ కు అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సర్కారు అనుమతిస్తే.. బీజేపీ సర్కారు దాన్ని ఏటా రెన్యూవల్ చేస్తోందన్నారు. హిల్ టాప్ బ్రాండ్ పేరుతో విస్కీ బాట్లింగ్  ట్రయల్ ను లిక్కర్ ప్లాంట్ లో ప్రారంభించడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. లిక్కర్ ప్లాంట్ కు పర్మిషన్ ఇవ్వడం ఉత్తరాఖండ్ కల్చర్ కు వ్యతిరేకంగా చేసిన నేరమని హిమాలయ బచావో ఆందోళన్ కన్వీనర్ సమీర్ రటూరి అన్నారు.