హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మనీల్యాండరింగ్ డొంక కదులుతోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీల ముసుగులో జరిగిన వందల కోట్ల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టింది. హైదరాబాద్ అడ్డాగా సాగుతున్న షెల్ కంపెనీల చిట్టాను సేకరించి దర్యాప్తులో వేగం పెంచింది. కంపెనీల రిజిస్ట్రేషన్స్‌తోపాటు ఆర్థిక లావాదేవీలపై రిపోర్టు రెడీ చేసింది. సుమారు 28 కంపెనీల లిస్టును ఢిల్లీలోని హెడ్ ఆఫీస్‌కు అందించింది. దీంతో రాష్ట్రానికి చెందిన షెల్ కంపెనీల డైరెక్టర్లు, అనుమానితులు ఢిల్లీ ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆగస్టు17న సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతోపాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. సీబీఐ సేకరించిన ఆధారాలతో మనీ ల్యాండరింగ్, షెల్ కంపెనీలు బయటపడ్డాయి.
ఈడీ చేతికి కీలక డాక్యుమెంట్లు
ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఈ నెల 7న దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సోదాలు చేసింది. షెల్ కంపెనీల నుంచే అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే బెంగళూరు, హైదరాబాద్‌లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ఆర్‌ఓసీ)లో నమోదైన కంపెనీల వివరాలు రికార్డు చేసింది. ఇందులో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
సైబరాబాద్‌లోని నానక్‌రాంగూడ, కోకాపేట్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, రామంతాపూర్, మేడ్చల్ జిల్లా సుచిత్ర, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, జూబ్లీహిల్స్‌లో అడ్రస్‌లపై సాఫ్ట్‌వేర్ కంపెనీలు రిజిస్టర్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వీటితో రాబిన్ డిస్టిలరీ, డిస్టిబ్యూటర్స్ కంపెనీలకు కూడా సంబంధాలున్నట్లు తెలిసింది. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఆయా కంపెనీల అడ్రస్‌లకు ఈడీ అధికారులు వెళ్లారు. సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్‌లో రాబిన్ డిస్టిలరీ రిజిస్టర్ అయిన అడ్రస్‌లో బ్యూటీ పార్లర్, ల్యాండ్ మాస్టర్ పేర్లతో షాపులున్నాయి. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్‌తో లింకులున్న చాలా కంపెనీల ఫేక్ అడ్రస్‌లతో రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఆర్‌ఓసీ రికార్డుల్లో తప్ప ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇలాంటి కంపెనీలతో ఆర్థికలావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.
ఏ పనీ చేయకున్నా.. మనీ ట్రాన్సాక్షన్స్
సాఫ్ట్‌వేర్ కంపెనీల పేర్లతో రిజిస్టరైన చాలా కంపెనీలు ప్రస్తుతం ఆపరేషన్స్‌లో లేనట్టు తెలిసింది. కానీ ఆయా కంపెనీల నుంచి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇతర ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏటా లెక్కల్లో లేని రూ.వందల కోట్లతో ఇల్లీగల్ దందా నడుస్తున్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ప్రాథమిక ఆధారాలతో ఢిల్లీలో రిపోర్ట్ చేసింది. ఢిల్లీ జోన్‌లోనే ఈడీ కేసు నమోదవడంతో ఎంక్వైరీ అంతా అక్కడి నుంచే జరిగే అవకాశాలున్నాయి. ఈ కేసులో అనుమానితులకు నోటీసులిచ్చాక ఢిల్లీ ఆఫీస్‌లోనే విచారిస్తారని తెలిసింది.
