రెండ్రోజుల్లోనే లిక్కర్ సేల్స్ రూ.282 కోట్లు

రెండ్రోజుల్లోనే లిక్కర్ సేల్స్ రూ.282 కోట్లు

మొన్న రూ. 125 కోట్లు.. నిన్న రూ. 157 కోట్ల మద్యం అమ్మకాలు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజులుగా మద్యం అమ్మకాలు జోరందుకున్నయి. సడెన్​గా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మంగళవారం జనం షాపులకు విరగబడి మరీ లిక్కర్, బీర్లు కొనుక్కుపోయారు. వైన్స్ బంద్‌ చేస్తే లిక్కర్‌ దొరకదని కావల్సినంత పట్టుకుపోయారు. నిరుటి లెక్క ఇబ్బంది పడొద్దని చాలా మంది ఎక్కువగానే సరుకును కొనుక్కెళ్లారు. మంగళ, బుధవారం.. రెండ్రోజుల్లోనే డిపోల నుంచి రూ. 282 కోట్ల మద్యం తరలింది. ఇందులో 3.67 లక్షల కేసుల ఐఎంఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌), 1.82 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే రూ.91 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డిలో రూ.58 కోట్లు, హైదరాబాద్‌ లో రూ. 26 కోట్లు, మేడ్చల్‌ రూ. 7 కోట్ల మేరకు సేల్స్ అయ్యాయి. రోజువారీగా చూస్తే మంగళవారం రూ. 125 కోట్లు, బుధవారం రూ. 157 కోట్ల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో ఇప్పటిదాకా 12 రోజుల్లో రూ. 830 కోట్ల లిక్కర్‌ సేల్‌ అయితే, అందులో గత రెండు రోజుల్లోనే రూ. 282 కోట్ల మద్యం అమ్మడం విశేషం.  

పొద్దున్నే వైన్స్ లు ఓపెన్‌..
రాష్ట్రంలో బుధవారం లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని పనులకు సర్కారు సడలింపులు ఇచ్చింది. వైన్స్‌ లు, బార్లు, కల్లు దుకాణాలకు పర్మిషన్ ఇచ్చింది. దీనిపై ఎక్సైజ్ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో మిగతా అన్ని రకాల షాపుల్లాగే వైన్స్ లు కూడా పొద్దున ఆరింటికే తెరిచారు. చాలా చోట్ల ఉదయం 7 గంటలకే భారీగా క్యూలు కనిపించాయి. అక్కడక్కడా కరోనా రూల్స్ పాటించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని షాపుల మాదిరిగా వైన్స్ ను కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

బోరుమంటున్న బార్‌ ఓనర్లు
వైన్స్‌ లు, కల్లు దుకాణాలతో పాటు బార్లను కూడా ఓపెన్‌ చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ నాలుగు గంటలే టైం ఉండటం, అది కూడా పొద్దున్నే కావడంతో గిరాకీలు లేక బార్ ఓనర్లు లబోదిబోమంటున్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌లోని ఓ బార్‌లో రూ. 300, శేరిలింగంపల్లిలోని ఓ బార్‌కు రూ. 600, సూర్యాపేట టౌన్‌లోని మరో బార్‌కు రూ. 2 వేల చొప్పున మాత్రమే కలెక్షన్స్‌ వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని బార్ల ఓనర్లు చెప్తున్నారు. బార్లు తెరవకుంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండేదని, కానీ బార్ల నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేసుకోవాలనే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రెండ్రోజుల్లో సేల్స్‌ ఇలా..
తేదీ          లిక్కర్‌                    బీర్లు                       విలువ (రూ. కోట్లలో)     
11         1.63 లక్షల కేసులు    99.6 లక్షల కేసులు       125  
12        2.04 లక్షల కేసులు     82.6 వేల కేసులు         157  
మొత్తం   3.67 లక్షల కేసులు    1.82 లక్షల కేసులు       282