ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడాదిలో లిక్కర్‌‌ సేల్స్‌‌ రూ.294 కోట్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడాదిలో లిక్కర్‌‌ సేల్స్‌‌ రూ.294 కోట్లు
  • వేసవి, పండుగ సీజన్లలో పెరిగిన బీర్ల అమ్మకాలు
  • ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో లిక్కర్‌‌ సేల్స్‌‌
  • గతేడాదితో పోలిస్తే  తక్కువే..    సేల్స్‌‌ పెంచాలంటూ టార్గెట్‌‌

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో రూ. 294 కోట్ల లిక్కర్‌‌ తాగారు. జిల్లాలో కొత్త వైన్స్‌‌ ప్రారంభించి డిసెంబర్‌‌ 1 నాటికి ఏడాది పూర్తైంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కలిపి మొత్తం 336 మద్యం షాపులకు లైసెన్స్‌‌ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు షాపుల పరిధిలో  రూ. 294.08 కోట్ల లిక్కర్‌‌ అమ్మకాలు జరిగాయి. ఇందులో బీర్లే ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఏడాదిలో 30,50,320 పెట్టెల లిక్కర్‌‌ అమ్ముడుకాగా, 43,30,604 పెట్టెల బీర్లు సేల్‌‌ అయ్యాయి.

2021తో పోలిస్తే తగ్గిన సేల్స్‌‌

ఉమ్మడి జిల్లాలో 2021తో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్‌‌ సేల్స్‌‌ తగ్గాయి. 2021లో జనవరి నుంచి డిసెంబర్‌‌ వరకు రూ.358.19  కోట్ల లిక్కర్‌‌ సేల్‌‌ కాగా, ఈ ఏడాది రూ.294.08 కోట్లకు పడిపోయింది. ఎక్సైజ్‌‌ రెవెన్యూ రూ.64.11 కోట్లకు తగ్గింది. 2021లో ఏపీలో మద్యం రేట్లు భారీగా ఉండడంతో ఉమ్మడి జిల్లా నుంచి ఏపీకి మద్యం గుట్టుగా సప్లై చేశారు. 2021లో సేల్స్‌‌ పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. 

సేల్స్‌‌ పెంచేలా టార్గెట్లు

కొత్త ఏడాది నుంచి ఎక్సైజ్‌‌ ఆఫీసర్లకు కౌంట్‌‌ డౌన్‌‌ మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలో సేల్స్‌‌ పెంచాలని ఉన్నతాధికారులు టార్గెట్‌‌ పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల సూర్యాపేట జిల్లా ఎక్సైజ్‌‌ ఆఫీసర్లతో కమిషనర్‌‌ రివ్యూ చేశారు. తుంగతుర్తి సర్కిల్‌‌ పరిధిలో మద్యం సిండికేట్‌‌ వల్ల సేల్స్ భారీగా పడిపోయాయి. 
దీంతో కమిషనర్‌‌ ఆఫీసర్లను మందలించినట్లు తెలిసింది. హుజూర్‌‌నగర్‌‌ పరిధిలో నాటుసారా అరికట్టడంలో ఫెయిల్‌‌ అయ్యాడన్న కారణంతో ఎస్‌‌హెచ్‌‌వోను ఇటీవల సస్పెండ్‌‌ చేశారు. అయితే నల్గొండ జిల్లాలో ఏపీ బార్డర్‌‌ ఎఫెక్ట్‌‌ అంతగా లేకపోయినప్పటికీ దాన్నే సాకుగా చూపించి ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది నుంచి సేల్స్‌‌ పెంచేందుకు బెల్ట్‌‌ షాపులను టార్గెట్‌‌ చేశారు. ప్రస్తుతం హోల్‌‌సేల్‌‌ పేరుతో వ్యాపారులు బెల్టుషాపుల దందా నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరకు పైన రూ.5,  10 మార్జిన్‌‌ చూసుకొని బెల్టు షాపులకు అమ్ముతున్నారు. ఇక నుంచి ఎమ్మార్పీ ధరలకే మద్యం ఇవ్వాలని, తద్వారా సేల్స్‌‌ పెంచాలని టార్గెట్‌‌ పెట్టినట్లు తెలిసింది.

సమ్మర్‌‌, పండుగ సీజన్లలోనే ఎక్కువ సేల్స్‌‌

వేసవి, పండుగల సీజన్లలో మద్యం సేల్స్‌‌ భారీగా జరిగాయి. ప్రధానంగా బీర్ల విషయానికొస్తే సమ్మర్‌‌ సీజన్‌‌లో ఎక్కువ అమ్ముడుపోయాయి. ఏప్రిల్, మే, జూన్‌‌లో, ఆ తర్వాత దసరా, గణేశ్‌‌ నవరాత్రుల టైంలో రికార్డు స్థాయి సేల్స్ నమోదయ్యాయి. ఈ టైంలో లిక్కర్‌‌ సేల్స్‌‌లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయి సేల్స్ జరుగగా, మిగతా 11 నెలల్లో ఓ మోస్తరుగా అమ్మకాలు సాగాయి.