ఎలక్షన్ ఖర్చులకు లిక్కర్ ఫండ్ ఇయ్యాల్నట

ఎలక్షన్ ఖర్చులకు లిక్కర్ ఫండ్ ఇయ్యాల్నట

రాష్ట్రంలో లిక్కర్ కేవలం సర్కారుకు మాత్రమే కాకుండా కొన్నిసార్లు లీడర్లకు కూడా ఆదాయ వనరుగా పనికొస్తున్నది. పైగా ఇప్పుడు ఎలక్షన్​ సీజన్ కావడంతో కొందరు నాయకులు వైన్స్ యజమానుల నుంచి వసూళ్లకు సిద్ధమయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2,620 వైన్స్​లకు లక్కీ డ్రా తీసి టెండర్లు ఫైనల్​ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో అప్లికేషన్​కు రూ.2 లక్షల చొప్పున నాలుగైదు అప్లికేషన్లు వేసి టెండర్​ దక్కించుకుంటే.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని షాపులు​ దక్కించుకున్న యజమానులు వాపోతున్నారు. ‘టెండర్​ ఫీజు, ఫస్ట్​ ఇన్​స్టాల్​మెంట్​ కట్టేశాం.. ఇంకేముంది  డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి షాపులు ఓపెన్​ చేసుకోవడమే’ అని అనుకుంటుంటే.. స్థానిక ఎక్సైజ్ ​సీఐల నుంచి వసూళ్లు మొదలయ్యాయి. ‘అదేంటి ఇంకా షాపులు మా చేతికి కూడా రాలేదు. అప్పుడే డబ్బులు ఎందుకివ్వాలి’ అని అడిగితే.. ‘పై నుంచి ఆర్డర్​ వచ్చింది. మంత్రికి, ఎమ్మెల్యేలకు వాటా పంపాలి. ఎన్నికల ఖర్చులకు మీ సహకారం ఉంటేనే.. భవిష్యత్​లో షాపులు సాఫీగా నడుపుకుంటారని’ సున్నితంగా హెచ్చరిస్తున్నారు

రూ.65 కోట్లు టార్గెట్​

కొత్త వైన్స్​దక్కించుకున్న వారి నుంచి మొత్తం రూ.65 కోట్లు వసూలు చేయాలని టార్గెట్​గా ​పెట్టుకున్నట్టు సమాచారం. ఎక్సైజ్​ అధికారులే ఈ వసూళ్ల బాధ్యతను నెత్తిన పెట్టుకున్నట్లు తెలిసింది. ఇందులో వారికీ కొంత వాటా ఉందని ఆ శాఖలో ప్రచారం జరుగుతున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వైన్స్​లు దక్కించుకున్నోళ్లందరి నుంచి రూ.2.5  లక్షల చొప్పున అడుగుతున్నారని.. టెండర్ల ఫీజు కంటే.. వీళ్ల వసూళ్లే ఎక్కువగా ఉన్నాయని షాపుల​యజమానులు చర్చించుకుంటున్నారు. ఇవ్వకపోతే ఒక బాధ.. ఇవ్వాలంటే ఇంకో బాధ అన్న చందంగా తమ పరిస్థితి మారిదంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాదు.. ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు ఎలక్షన్లలో అవసరమైన ఖర్చులకూ వైన్స్​లే దిక్కయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్​ షెడ్యూల్​వచ్చేలోపు రెండున్నర లక్షలు వసూలు చేసి ఇవ్వాల్సిందేనని మంత్రుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని ఆఫీసర్లు చెప్పుకుంటున్నారు. డబ్బులు ఇవ్వనివారి లిస్ట్​ను కూడా రెడీ చేసి పెట్టుకుంటామని అధికారుల నుంచి సంకేతాలు పంపుతుండడంతో.. ఎలక్షన్లలో సేల్స్​ పెరిగి లాభమైతదని అనుకుంటే.. తమ నుంచే ఎన్నికలకు ఖర్చు పేరుతో తీసుకోవడంపై షాపుల​యజమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

‑ హైదరాబాద్, వెలుగు