వైన్స్​ కనబడితే వదలరు.. లిక్కర్​ షాపులే టార్గెట్​గా చోరీలు

 వైన్స్​ కనబడితే వదలరు.. లిక్కర్​ షాపులే టార్గెట్​గా చోరీలు

యాదాద్రి, వెలుగు : వైన్స్ లను టార్గెట్​ చేసి దొంగతనాలు చేస్తున్న నలుగురిని యాదాద్రి జిల్లా తుర్కపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. డీసీపీ రాజేశ్​చంద్ర కథనం ప్రకారం...కామారెడ్డికి చెందిన పిన్నోజు రవి గతంలో వైన్స్ లో చోరీలు చేసేవాడు. కరీంనగర్ జైలులో ఉండగా ఓ చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం గాగిల్లాపూర్​కు చెందిన హరీశ్​తో పరిచయమైంది.

బెయిల్​పై బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి రాజాపేట వద్ద ఒక వైన్ షాపులో చోరీ చేసి నల్గొండ జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత మోత్కూర్ మండలం ముసిపట్లకు చెందిన శాకాపురం నవీన్, సిద్దిపేటకు చెందిన చెప్యాల నర్సింహులును కలుపుకున్నారు. నలుగురు కలిసి ఈ నెల 24న తుర్కపల్లిలో వైన్స్ షట్టర్​ తొలగించి రూ. 3,45,600 నగదు, రూ. 2 వేల విలువైన 8 మద్యం బాటిల్స్ అపహరించారు. వైన్స్ వద్ద సీసీ కెమెరాల్లో దొంగతనం రికార్డు కావడంతో పుటేజీల  ఆధారంగా పోలీసులు గాలించారు. నిందితులు టూ వీలర్లపై వెళ్తూ వాసాలమర్రి వద్ద కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్​లు , రూ. 2, 04, 000 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించినట్లు డీసీపీ తెలిపారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, యాదాద్రి ఏసీపీ రమేశ్​కుమార్, యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్ రావు, తుర్కపల్లి ఎస్ఐ తక్యోద్దీన్, సిబ్బంది శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రదీప్ కుమార్, రవి నాయక్, నిరంజన్ శివకుమార్ ఉన్నారు.