తెలంగాణలో లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు సీఎం కేసీఆర్. అయితే కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలో యథావిధిగా అమలు చేస్తామని చెప్పారు. లిక్కర్ షాపులను కూడా బుధవారం నుంచి ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలుపై దాదాపు ఏడు గంటల పాటు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ చర్చించింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా మీడియాకు వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాను బాగా కంట్రోల్ చేశామని అన్నారు సీఎం కేసీఆర్. ప్రజలంతా లాక్ డౌన్ కు మంచిగా సహకరిస్తున్నారని, మరికొన్నాళ్లు ఓపిక పడితే ఈ మహమ్మారి నుంచి బయటపడుతామని అన్నారు. ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు 70 రోజుల పాటు కంట్రోల్ చేయగలిగితే దానిని పూర్తిగా కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని ప్రకటించారు.
రెడ్ జోన్లలోనూ వైన్ షాపులు ఓపెన్
లిక్కర్ షాపులను బుధవారం నుంచి ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. అయితే జనాలు గుంపులు చేరొద్దని కోరారు. సామాజిక దూరం పాటించకుంటే వెంటనే షాపులు క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్లలో తప్పించి.. రెడ్ జోన్లలోనూ షాపులు తెరుస్తామని చెప్పారు. చీప్ లిక్కర్ పై 11 శాతం, మిగిలిన అన్ని బ్రాండ్స్ పై 16 శాతం రేట్లు పెంచుతున్నామని తెలిపారు.
