
- వారిలో ఒకరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా ముథోల్, తానూర్మండలాల్లోని రెండు వైన్స్‌ల్లో దొంగతనం చేసిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ తెలిపారు. శనివారం భైంసాలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. మే నెల 24న అర్ధరాత్రి ముథోల్‌లోని శ్రీరాజరాజేశ్వర వైన్స్లో దొంగతనం జరిగింది. గత నెల 22న రాత్రి తానూర్‌లోని శ్రీ లక్ష్మి వైన్స్‌లోనూ చోరీ జరిగింది.
ఈ చోరీ కేసులను ఛేదించేందుకు ముథోల్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు, టెక్నికల్ సహాయంతో నిందితులను గుర్తించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడ్బి లోలి గ్రామానికి చెందిన వినోద్, బ్యాగరి రోహిత్, నీరడి శ్రావణ్ కుమార్, సాయి ఆదిత్య గౌడ్, నవీన్, దిలీప్ కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. వినోద్ గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తుండగా.. మిగతా ఐదుగురు నిత్యం మద్యం తాగేందుకు అక్కడికి వెళ్లేవారు. రెండు బృందాలుగా ఏర్పడి వైన్స్‌ల్లో చోరీలకు పాల్పడ్డారు.
ముథోల్ వైన్స్లో రూ.2.50 లక్షలు, తానూర్ వైన్స్లో రూ. 80 వేల మద్యం బాటిళ్లు చోరీ చేసి తీసుకెళ్లి వినోద్‌కు అప్పగించగా.. తన బెల్టు షాపులో విక్రయించాడు. దొంగతనం చేసేందుకు ఈ ఆరుగురు మరోసారి ముథోల్‌కు వచ్చారు. శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయాన్ని ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి నగదును స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సమావేశంలో సీఐ మల్లేశ్, ఎస్సైలు జుబేర్, బిట్ల పెర్సిస్ పాల్గొన్నారు.