ఐపీఓ తర్వాత 3 రోజుల్లోనే లిస్టింగ్.. గడువును సగానికి తగ్గించిన సెబీ

ఐపీఓ తర్వాత 3 రోజుల్లోనే లిస్టింగ్.. గడువును సగానికి తగ్గించిన సెబీ

ముంబై: ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​ (ఐపీఓ) ముగిశాక మూడు రోజుల్లోనే ఆ కంపెనీ షేర్లు ఇకమీదట లిస్టవుతాయి. ప్రస్తుతం ఆరు రోజులుగా ఉన్న గడువును సగానికి తగ్గిస్తూ సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్ల డిస్​క్లోజర్ నిబంధనలను కొంత కఠినం చేయాలని కూడా డెసిషన్​ తీసుకున్నారు. 

ఫిన్​ఫ్లుయెన్సర్లను కట్టడి చేస్తాం....

మార్కెట్లో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఫైనాన్షియల్​ ఇన్​ఫ్లుయెన్సర్ల (ఫిన్​ఫ్లుయెన్సర్లు) బారి నుంచి చిన్న ఇన్వెస్టర్లను కాపాడేందుకు సెబీ నడుం కట్టింది. అన్​రిజిస్టర్డ్​ ఇన్​ఫ్లుయెన్సర్ల ప్రోద్భలంతో డబ్బులు పోగొట్టుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు చొరవ తీసుకోనుంది. ఫైనాన్షియల్​ ఇన్​ఫ్లుయెన్సర్ల కోసం రూల్స్​, గైడ్​లైన్స్​ తేవాలని సెబీ నిర్ణయించినట్లు చైర్​ పర్సన్​ మాధబి పురి బుచ్​ వెల్లడించారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఇందుకోసం ఒక డిస్కషన్​ పేపర్​ తెస్తున్నామని చెప్పారు. కోట్లలో సంపాదించినా, పన్నులు కట్టకపోవడంతో  35 మంది సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లకు కిందటి వారంలో ఇన్​కంటాక్స్ డిపార్ట్​మెంట్​ నోటీసులు పంపించింది. అంతేకాదు, కేరళ రాష్ట్రంలో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న టాప్​ 13 యూట్యూబర్లపై దాడులు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో సెబీ  చైర్​ పర్సన్​ మాధబి పురి బుచ్​ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్​ ఇన్​ఫ్లుయెన్సర్ల నియంత్రణ కోసం నడుం బిగించామని, ఇందుకు డిస్కషన్​ పేపర్​ రెడీ చేస్తున్నామని బుచ్​ వెల్లడించారు. బుధవారం రాత్రి సెబీ బోర్డు మీటింగ్​ ముగిశాక ఆమె మీడియాతో మాట్లాడారు. 

మానిప్యులేషన్​తో ఇన్వెస్టర్లకు బురిడీ...

ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే ప్రయత్నం ఎవరైనా చేస్తే సంతోషం కలిగించేదేనని, కానీ, అడక్కుండానే తమ వద్ద రిజిస్ట్రేషన్​ పొందని కొంత మంది అడ్వైజర్ల అవతారాలు ఎత్తుతుండటం ఇబ్బందికరమైనదని మాధబి పురి బుచ్​ స్పష్టం చేశారు. ఓ వైపు మార్కెట్​ మానిప్యులేషన్​కు పాల్పడుతూ, మరోవైపు అమాయక ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలు ఆశచూపిస్తూ గేలం వేయడం క్షమించరానిదని పేర్కొన్నారు. తాము సలహాలిచ్చే ప్లాట్​ఫామ్స్​ నుంచి కమిషన్ల రూపంలోనూ, ఆయా షేర్లలో కొనుగోళ్లు–అమ్మకాల ద్వారా లాభాల రూపంలోనూ కొంత మంది ఇన్​ఫ్లుయెన్సర్లు డబ్బులు దండుకుంటున్నారని బుచ్​ వివరించారు. యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​, టెలిగ్రాం, వాట్సాప్​, ట్విట్టర్ ​ప్లాట్​ఫామ్​ల ద్వారా సలహాలిచ్చే ఫిన్​ఫ్లుయెన్సర్ల సంఖ్య బాగా పెరిగిపోయిందని చెప్పారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని చిన్న ఇన్వెస్టర్లను సెబీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని పేర్కొన్నారు. మరో వైపు కొంత మంది ఇన్వెస్ట్​మెంట్​ అడ్వైజర్లుగా సెబీ వద్ద గుర్తింపు పొంది, ఆ గుర్తింపును చూపించి అక్రమంగా ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను చేస్తున్నట్లు బుచ్​ వెల్లడించారు. ఇలాంటి వారిపైనా నియంత్రణలు తప్పనిసరని చెప్పారు.

వాట్సాప్​, టెలిగ్రామ్‌‌‌‌ గ్రూప్​ల మూసివేత..

మార్కెట్​ కదలికలపై డేటాను లీక్​ చేస్తున్న కొన్ని వాట్సాప్​, టెలిగ్రామ్‌‌‌‌ గ్రూప్​లు మూతపడేలా సెబీ ఇప్పటికే చొరవ తీసుకుంది. అలాంటి గ్రూప్​ల కారణంగా చాలా లిస్టెడ్​ కంపెనీలు తమ ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ ప్రకటన కోసం మార్కెట్​ నడవని వారాంతాలనే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సెబీ వివరిస్తోంది. అంతేకాదని, మీడియాతో మాట్లాడటం కూడా చాలా కంపెనీలు మానుకుంటున్నాయని పేర్కొంటోంది. ఈ ఏడాది మార్చి నెలలో కొంత మంది యూట్యూబర్లు, 44 సంస్థలను సెక్యూరిటీస్​ మార్కెట్​ నుంచి సెబీ నిషేధించింది. షేర్ల ధరలను మానిప్యులేట్​ చేయడం ద్వారా అక్రమ లాభాలు గడిస్తున్నారనే కారణంగానే వారిపై చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో మరి కొంత మంది ఇన్​ఫ్లుయెన్సర్లపై కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు, మార్కెట్​ కార్యకలాపాలు నిర్వహించకుండా కట్టడి చేస్తూ చర్యలు తీసుకుంది.