ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం నేడే

ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం నేడే

‘‘విద్య అంటే.. ఇప్పటికే మనుషులందరిలో ఉన్న పరిపూర్ణతను వ్యక్తపర్చడం’’ అని స్వామి వివేకానంద అన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. అంతటి మహత్తరమైన అక్షరాస్యతను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకూ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అదే సెప్టెంబరు 8.  ఈ స్పెషల్ డే నిర్వహణ దిశగా బీజాలు 1966 సంవత్సరంలో పడ్డాయి.  

ఆ ఏడాది సెప్టెంబరు 8 నుంచి 19 వరకు ఇరాన్ రాజధాని తెహ్రాన్ లో ప్రపంచదేశాల విద్యా శాఖ మంత్రుల సమ్మేళనం జరిగింది. ఇందులో ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవ నిర్వహణ అంశంపై తొలిసారి సమగ్ర చర్చ జరిగింది. ఇందులో చేసిన ప్రతిపాదనలపై 1966 అక్టోబరు 26న జరిగిన యునెస్కో 14వ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన వెలువడింది. ఏటా సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఏటా ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఏటా ఒక స్పెషల్ లిటరసీ థీమ్ ను ప్రకటిస్తున్నారు. 2022 సంవత్సరం కోసం లిటరసీ డే థీమ్.. ‘ ట్రాన్స్ ఫామింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేసెస్’. విద్యాబోధనా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతిక వనరులను సమకూర్చాలి అనేది ఈ థీమ్ లక్ష్యం.

 

ఉద్యమ స్థాయి కార్యక్రమాలివీ.. 

  • చదవడం, రాయడం, వినడం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అంటారు. అయితే రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత కాదనీ.. గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. 
  • దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 1988లో నేషనల్ లిటరసీ మిషన్ (జాతీయ అక్షరాస్యత కార్యక్రమం) ప్రారంభమైంది. 2007 నాటికి దేశంలో 75 శాతం అక్షరాస్యత రేటును సాధించాలనే లక్ష్యంతో ఈ మిషన్ ను మొదలుపెట్టారు. ఇది 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న నిరక్షరాస్యులకు ప్రయోజనాత్మక అక్షరాస్యతను అందిస్తోంది. ప్రస్తుతం జాతీయ అక్షరాస్యతా శాతం 77.7. అంటే ఈ మిషన్ లక్ష్యం దాదాపు నెరవేరినట్టే. 
  • సర్వశిక్షా అభియాన్ (సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమ్) కార్యక్రమం 2001లో ప్రారంభమైంది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలలందరూ పాఠశాలలకు వెళ్లేలా చేసేందుకు, 2010 నాటికి ఎనిమిదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేసేలా చర్యలు చేపట్టే లక్ష్యంతో ఈ  ప్రోగ్రామ్ ను మొదలుపెట్టారు. ఈ పథకంలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. విద్యా హామీ పథకం, ప్రత్యామ్నాయ వినూత్న విద్య , ఒక కిలోమీటరు వ్యాసార్థంలో పాఠశాల అందుబాటులో లేని బాలలకు విద్యా సాధికారత.  

  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం 1994లో ప్రారంభమైంది. 2005 నాటికి దీని పరిధిలో 1,60,000 కొత్త  బడులను ప్రారంభించారు. వీటిలో సుమారు 84,000 ప్రత్యామ్నాయ పాఠశాలలు ఉన్నాయి.
  • విద్యార్థుల స్కూల్ డ్రాపవుట్ రేటును తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని  1995లో ప్రారంభించారు. దీని కారణంగా.. 2002  మార్చి 1 న 6 నుంచి -14 సంవత్సరాల వయసున్న దాదాపు 205 మిలియన్ల మంది బాలల్లో 82.5% మంది కొత్త అడ్మిషన్లు తీసుకున్నారు. 2002, 20-03 విద్యా సంవత్సరం నాటికి ప్రాథమిక స్థాయిలోనే పాఠశాలకు వెళ్లడం మానుకున్న విద్యార్థుల రేటు 34.9% ఉండగా, ఉన్నత ప్రాథమిక స్థాయిలో 52.8%  ఉంది. 

మహిళల అక్షరాస్యత ఇంకా అంతంతే.. 

మనదేశంలో అక్షరాస్యతా శాతం క్రమంగా పెరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో (1950లో) ఇది కేవలం 18 శాతమే ఉండగా, ఇప్పుడిది 77.7 శాతానికి చేరింది. గ్రామీణ అక్షరాస్యత (73.5 శాతం), పట్టణ అక్షరాస్యత (87.7  శాతం) కూడా గణనీయంగా పెరిగాయి.  పురుషుల అక్షరాస్యతా శాతం సైతం 84.7 శాతానికి చేరింది. అయితే మహిళల అక్షరాస్యతా శాతం మాత్రం ఇంకా 70 శాతం దాటకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈవిషయంలో శ్రీలంక (90 శాతం), జింబాబ్వే (88 శాతం) దేశాలు మన కంటే ముందు వరుసలో ఉన్నాయి. మహిళల అక్షరాస్యత పెంచేలా అన్ని సామాజిక వర్గాలను చైతన్యవంతం చేసే దిశగా ఉద్యమ పంథాలో కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళా అక్షరాస్యతలో మనం అంతర్జాతీయ సగటును చేరుకోగలుగుతాం. అక్షరాస్యత అనే అస్త్రం అందకుండా మహిళల సాధికారత అనేది స్వప్నంగానే మిగిలిపోయే అవకాశాలు ఉంటాయని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళా అక్షరాస్యత లో అత్యంత వెనుకబడి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (59.5 శాతం), రాజస్థాన్ (57.6 శాతం), బిహార్ (60.5 శాతం), ఉత్తరప్రదేశ్ (63.4 శాతం) ఉన్నాయి. 

కింది నుంచి నాలుగో స్థానంలో తెలంగాణ.. 

2017,18 మధ్యకాలంలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) నిర్వహించిన సర్వే ప్రకారం.. అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం (72.8 శాతం) కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. కింది నుంచి రెండో స్థానంలో రాజస్థాన్ (69.7 శాతం), మూడో స్థానంలో బిహార్ (70.9 శాతం), ఐదో స్థానంలో ఉత్తరప్రదేశ్ (73 శాతం), ఆరో స్థానంలో మధ్యప్రదేశ్ (73.7 శాతం) ఉన్నాయి. అక్షరాస్యత బిహార్(70.9 శాతం)  కంటే   ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో (66.4 శాతం) తక్కువగా ఉండటం గమనార్హం. తెలంగాణలో ఏపీ కంటే కాస్త మెరుగ్గా 72.8 శాతం అక్షరాస్యత ఉంది. మునుపటిలాగే అక్షరాస్యతలో తొలి పది స్థానాల్లో కేరళ(96.2 శాతం),  ఢిల్లీ (88.7 శాతం), ఉత్తరాఖండ్ (87.6 శాతం), హిమాచల్ ప్రదేశ్ (86.6 శాతం), అస్సాం (85.9 శాతం), పంజాబ్ (83.7 శాతం), తమిళనాడు (82.9 శాతం), గుజరాత్ (82.4 శాతం), పశ్చిమ బెంగాల్ (80.5 శాతం), హర్యానా (80.4 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలోని నిరక్షరాస్యుల్లో దాదాపు సగం మంది (48.12%) .. హిందీ -మాట్లాడే ఆరు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో ఉన్నారు. మనం ఉన్నతమైన జీవనాన్ని కొనసాగించాలన్నా.. మన దేశం అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. అక్షరాస్యత అనేది ఎంతో అవసరం. అప్పుడే ప్రపంచంతో మనం పోటీ పడగలం. అన్ని రంగాల్లో ముందుకు సాగగలం. కొన్ని దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత. ఇక నుంచైనా పిల్లలతో పాటు వయోజన విద్యను కూడా ప్రోత్సహిద్దాం. అందరికీ అక్షరాలను నేర్పిద్దాం.. అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాం.

డిజిటల్ అక్షరాస్యతలోనూ అంతరాలు.. 

ఇది డిజిటల్ యుగం. కరోనా సమయంలో డిజిటల్ మాధ్యమాల  ద్వారా విద్యాబోధన నిర్వహించడాన్ని మనం చూశాం. ఆ సమయంలో డిజిటల్ మాధ్యమాలు లేక ఎంతోమంది పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వర్చువల్ క్లాస్ లకు అటెండ్ కాలేకపోయారు. ఆన్ లైన్ పరీక్షలను వదులుకున్నారు. జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) అంచనాల ప్రకారం.. నిరుపేద వర్గాలకు చెందిన 20 శాతం కుటుంబాల్లో కేవలం 2.7 శాతానికే కంప్యూటర్లు ఉన్నాయి. 8.9 శాతం మందికే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. 20 శాతం ధనిక కుటుంబాల్లో సైతం 27.6 శాతం కుటుంబాలకే కంప్యూటర్, సగం కుటుంబాలకు ఇంటర్నెట్ వసతి ఉన్నాయి.  డిజిటల్ లిటరసీ టూల్స్ గా పరిగణిస్తున్న స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. ఇది సరిపోదు అన్నట్టు.. 2020 మార్చిలో మొబైల్ ఫోన్లపై 12 నుంచి 18 శాతం మేర పన్నులను జీఎస్టీ మండలి పెంచింది. దీంతో వాటి ధరలు మరింత పెరిగాయి. ఇంటర్నెట్ చౌకగానే లభిస్తున్నప్పటికీ.. డిజిటల్ టూల్స్ కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేనందున డిజిటల్ అక్షరాస్యతలో తారతమ్యాలు ఇప్పట్లో చెరిగిపోయే దాఖలాలు దరిదాపుల్లో కనిపించడం లేదు.