సాహితీవేత్త ఆచార్య ర‌‌వ్వా శ్రీహ‌‌రి కన్నుమూత

సాహితీవేత్త ఆచార్య ర‌‌వ్వా శ్రీహ‌‌రి కన్నుమూత

హైదరాబాద్, వెలుగు: ప్రసిద్ధ సాహితీవేత్త, ద్రావిడ యూనివ‌‌ర్సిటీ మాజీ వీసీ ఆచార్య ర‌‌వ్వా శ్రీహ‌‌రి (80) శుక్రవారం రాత్రి క‌‌న్నుమూశారు. కొంత‌‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీహరి.. ఎల్బీనగర్​లోని ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ స‌‌భ్యులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ద్రావిడ వ‌‌ర్సిటీ వీసీగా సేవలందించిన ఆయన మృతిప‌‌ట్ల ప‌‌లువురు సాహితీవేత్తలు, ర‌‌చ‌‌యిత‌‌లు సంతాపం తెలిపారు. సంస్కృతాంధ్ర భాష‌‌ల‌‌కు తీర‌‌ని లోటు అని పేర్కొన్నారు.

‘భాస్కర రామాయణం’పై పరిశోధన

నల్గొండ జిల్లా, వెల్వర్తిలో 1943, సెప్టెంబరు 12న రవ్వా శ్రీహరి జన్మించారు. సీతారాంబాగ్​లోని సంస్కృత కాలేజీలో డీవోఎల్, బీవోఎల్ వ్యాకరణం చదివారు. తర్వాత వివేకవర్ధిని కాలేజీలో తెలుగు పండితుడిగా చేరి.. బీఏ పూర్తి చేశారు. ఎంఏ తెలుగు, సంస్కృతం పూర్తి చేశారు. 1967లో సరస్వత పరిషత్​లో లెక్చరర్​గా చేరారు.  1973లో ఓయూ తెలుగు శాఖలో చేరారు. ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్​డీ పట్టా అందుకున్నారు. హెచ్​సీయూలో 17 ఏండ్ల పాటు బోధన, పరిశోధనలు చేశారు. తెలుగులో 50, సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు. ఆచార్య రవ్వా శ్రీహరికి 2013లో సీపీ బ్రౌన్ పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. 

కేసీఆర్, జగన్ సంతాపం

శ్రీహరి మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం ప్రకటించారు. భాషా సాహిత్య రంగానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా సంతాపం ప్రకటించింది. శ్రీహరి పార్థివదేహానికి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ నివాళిఅ ర్పించారు.