ఏ కన్నతల్లి అయినా.. తన బిడ్డలను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. తన పిల్లలకు ఏ చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. మరి ఆ తల్లికే ఏదైనా ప్రమాదం ఎదురైతే.. గాయాలైతే.. చిన్న పిల్లలు కూడా పెద్ద హీరోలైపోతారు. ఆ ప్రమాదానికి కారణమైన వారిని ఎదురిస్తారు. అలాంటి ఓ సంఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి మీద అపారమైన ప్రేమ కురిపించిన ఆ చిన్నోడిపై నెటిజన్లు లైకుల రూపంలో ప్రశంసిస్తున్నారు.
చైనాలోని చాంగ్‌కింగ్ లో ఓ బుడతడు తన తల్లితో పాటు జీబ్రా క్రాసింగ్ మీదుగా రోడ్ దాటుతున్నాడు. ఇంతలో ఓ కారు వారిని ఢీకొనడంతో తల్లీకొడుకులు ఇద్దరూ ఒక్కసారిగా కిందపడ్డారు. వెంటనే ఆ పిల్లాడు తేరుకొని తన తల్లికి ఏమైందోనని పరిశీలించాడు. కింద పడిన తల్లిని చూసి కోపం పట్టలేకపోయాడు. ఒక్కసారిగా పైకి లేచి ఆ ప్రమాదానికి కారణమైన కారును కాలుతో తన్నాడు. అంతటితో ఆగకుండా.. కారులో కూర్చున్న వ్యక్తిని ఎదిరించబోయాడు. ఆ వ్యక్తి కారులో నుంచి దిగి రావడంతో భయపడి ఏడ్చుకుంటూ తన తల్లి వద్దకు చేరుకున్నాడు. ఇంతలో జరిగిన ఘటనను చూసి చుట్టు పక్కనున్న జనాలు గుమిగూడారు. కారు నడిపిన వ్యక్తి కూడా ఆ బుడతడి ధైర్యానికి ముచ్చట పడ్డాడు. వారిద్దర్నీ చికిత్స నిమిత్తం తన కారులోనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో తల్లి, కొడుకులకు ఎలాంటి గాయం కాలేదు. ఈ ప్రమాదానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ కారు డ్రైవర్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తల్లీ , బిడ్డల మధ్య ప్రేమ స్వచ్ఛమైనదని చెప్పడానికి ఈ వీడియో చిన్న ఉదాహరణ.
This little boy in China is his mummy's big hero – he vented his anger at a car that sent his mum flying pic.twitter.com/tCBNShmyHG
— SCMP News (@SCMPNews) December 11, 2019
