ప్రాణాపాయం నుంచి పరీక్ష హాల్​ కు.. ఉస్మానియాలో అరుదైన చికిత్స

ప్రాణాపాయం నుంచి పరీక్ష హాల్​ కు.. ఉస్మానియాలో అరుదైన చికిత్స
  • 17 ఏళ్ల యువతికి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు 
  • 20 గంటల్లో లివర్​ ట్రాన్స్​ప్లాంటేషన్​
  • రెండు వారాల్లో సంపూర్ణ ఆరోగ్యంతో యువతి డిశ్చార్జి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు 17 ఏండ్ల యువతి బ్లెస్సీ గౌడ్‌‌కు లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు. రెండు నెలల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలోకి వెళ్లిన ఆమె, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరవుతోంది. జూబ్లిహిల్స్‌‌లో తల్లితో నివసిస్తున్న బ్లెస్సీ గౌడ్ ఈ ఏడాది మే నెలలో జ్వరంతో బాధపడింది. 

చికిత్స కోసం ఆమెను ప్రైవేటు హాస్పిటల్‌‌లో చేర్పించగా, ఐదు రోజుల్లోనే ఆమె కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో మే 12న ఆమెను కుటుంబ సభ్యులు ఉస్మానియా హాస్పిటల్‌‌కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు లివర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు(అక్యూట్ ఫుల్మినెంట్ లివర్ ఫెయిల్యూర్) గుర్తించారు. 48 గంటల్లో లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ చేయకపోతే ప్రాణాలు కోల్పోతుందని తల్లిదండ్రులకు తెలిపారు.

సూపర్ అర్జెంట్ కేటగిరీ ద్వారా లివర్...

బ్లెస్సీ తల్లి, కుటుంబ సభ్యులు లివర్ దానం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, వారి లివర్ బ్లెస్సీకి సరిపోలేదు. దీంతో ఉస్మానియా డాక్టర్లు జీవన్‌‌దాన్ సంస్థకు బ్లెస్సీ పరిస్థితిని వివరిస్తూ సూపర్ అర్జెంట్ కేటగిరీలో లివర్ కోసం రిజిస్టర్ చేశారు. జీవన్‌‌దాన్ టీమ్ ఈ అభ్యర్థనను పరిశీలించి, లివర్ కేటాయింపునకు అనుమతించింది. అదే సమయంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌‌లో బ్లెస్సీ బ్లడ్ గ్రూప్‌‌కు సరిపోలే వ్యక్తి బ్రెయిన్ డెత్‌‌కు గురయ్యారు. ఆ వ్యక్తి లివర్‌‌ను జీవన్‌‌దాన్ బ్లెస్సీకి కేటాయించారు.

20 గంటల పాటు ఆపరేషన్...

మే 12న ఉస్మానియాలో అడ్మిట్ అయిన బ్లెస్సీకి, మే 14న సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌‌ఓడీ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో వైద్య బృందం లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ 20 గంటలు శ్రమించి విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఇలాంటి క్లిష్టమైన కేసులకు 20 గంటలు చాలా తక్కువ సమయం అని డాక్టర్లు చెబుతున్నారు. రెండు వారాల తర్వాత బ్లెస్సీ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా బ్లెస్సీ, ఆమె తల్లి తెలంగాణ ప్రభుత్వానికి, ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలోనే తొలిసారి....

దేశంలో సూపర్  అర్జెంట్ కేటగిరీలో ప్రభుత్వ హాస్పిటల్‌‌లో లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ జరగడం దేశంలో ఇదే తొలిసారని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జీవన్‌‌దాన్ టీమ్, ఉస్మానియా డాక్టర్లు వేగవంతమైన స్పందన, బ్లెస్సీ అదృష్టంతో సకాలంలో లివర్ దొరికిందని పేర్కొన్నారు. ఈ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ పూర్తిగా ఉచితంగా జరిగిందని, దీనికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు. 

మంత్రి దామోదర రాజనర్సింహ ఉస్మానియా వైద్య బృందాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ హాస్పిటళ్లు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లతో సమానమైన వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. జీవన్‌‌దాన్ సంస్థను బలోపేతం చేసి, ఆపదలో ఉన్న పేదలకు అవయవ దానం అందేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.