అన్నంత ఈజీ కాదు కరోనాతో బతకడం

అన్నంత ఈజీ కాదు కరోనాతో బతకడం

అందరికీ మొట్టికాయలు తప్పవు! 

‘కరోనాతో బతికేద్దాం’ ఈ మాట అన్నంత తేలిక కాదు నిజంగా కరోనాతో బతకడం. ఎంతో మంది ఛస్తూ బతుకుతున్నారు, కొందరు ఛస్తున్నారు. కరోనా బారిన పడని వ్యక్తి లేడు. ప్రతి వ్యక్తి డైరెక్టుగా తనకో, తన కుటుంబ సభ్యులకో, బంధువులకో, స్నేహితులకో పాజిటివ్​ వచ్చిందన్న కబురు అందుతూనే ఉంది. ఈ కారణంగానే జనం కేంద్రంలో ఉన్న మోడీ దగ్గర నుంచి రాష్ట్రాల ప్రభుత్వ అధినేతల వరకూ అందరినీ నిలదీసి కడిగి పారేస్తున్నారు. ఆయా అధికార పార్టీల నేతలు, అధికారంలో ఉన్న మంత్రులు ఇస్తున్న వివరణలు జనానికి సాంత్వన కలిగించడం లేదు. కారణం.. మాటలు ఎన్ని వింటున్నా సఫర్ అవుతున్న జనం వాటిని నమ్మడం లేదు.

కరోనా మహమ్మారి మాట పక్కన పెడితే, మన దేశంలో ఇతరత్రా జబ్బులతో అనారోగ్యం పాలవుతున్న వారందరికీ వైద్య పరంగా సరైన మౌలిక వసతులు లేవు. ఇక కరోనాను ఎదుర్కొని ప్రతి పౌరుడికి ఆరోగ్య భరోసాను ఇచ్చే పరిస్థితి లేదన్నది మరో నిజం. అది చేసేస్తున్నాం.. ఇది చేసేశాం.. అంటూ పాలకులు జనాలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప.. వారి వెతలు తీరడం లేదు. అందుకే జనాగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవాలు చెప్పకపోవడమే పాలకుల అసలు వైఫల్యం. మహమ్మారి మాటేసిందని ఓవర్ నైట్ తగిన మెడికల్ ఇన్ ఫ్రాస్టక్చర్ ను సిద్ధం చేయలేరు. డాక్టర్లను, వైద్య సిబ్బందిని నియమించలేరు. విపత్తును ఎదుర్కొనేందుకు తమ పరిధిలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వాస్తవం చెప్పినా పాలకులకు ఆబోరు దక్కేది.

కరోనా లెక్కలకు పొంతన లేదు
ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న కరోనా లెక్కలకు పొంతన కుదరడం లేదు. కళ్లెదురుగుండా కరోనా బారిన పడిన రోగులు, వారి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్న సందర్భాలే ఎక్కువ ఉంటున్నాయి. హాస్పిటల్స్ లో బెడ్స్ కోసం పరుగులు తీస్తున్న మాట నిజం. లక్షల రూపాయలు గుంజుతున్న ప్రైవేట్​ హాస్పిటల్స్ కు ఫీజులు చెల్లించేందుకు అప్పుల పాలవుతున్న పరిస్థితీ వాస్తవం. మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నా వాటిని అంగీకరించక క్యాష్ విరజిమ్మే వారికే ట్రీట్మెంట్ ఇస్తున్న కేసులే ఎక్కువ. ఇలాంటి కఠోర వాస్తవాలను పక్కనపెట్టి అంతా చేసేస్తున్నామని పాలకులు చెబుతూంటే రోగులు, వారి బంధువులు కన్నెర్ర చేయక ‘గమ్ము’నుంటారా? ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా రోగులందరికీ ఫ్రీ ట్రీట్​మెంట్​ అని ప్రకటించి, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఆదేశాలు ఇచ్చాయి. కానీ గ్రౌండ్ రియాల్టీ వేరేగా ఉందని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ అంత ఉదారంగా ఉండటం లేదు. కోట్లాది రూపాయల పెట్టుబడులతో వైద్య వ్యాపారంలో అడుగుపెట్టిన యాజమాన్యాలకు ఉచితం అనేది అంత తేలిగ్గా రుచించని ముచ్చట. ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పటల్స్​కు ‘ఆర్థిక భరోసా’ ఇవ్వనంత వరకు రోగుల అవస్థలు అలాగే కొనసాగుతూ ఉంటాయి.

సరైన మౌలిక వసతులు లేవు
వాస్తవానికి మనకు వైద్యపరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు. పది వేల మంది జనాభాకు 8.5 బెడ్స్, ఎనిమిది మంది డాక్టర్స్  మాత్రమే అందుబాటులో ఉన్నారు. పైగా దేశ జనాభాలో 80 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. 68 శాతం మందికి పరిమితమైన లేదా అసలు అత్యవసర మెడిసిన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ తెలిసిన పాలకులు కరోనా టైంలో ప్రజల ఆరోగ్య భద్రతను ఒక బాధ్యతగా ఎందుకు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా మోడీజీ, రాష్ట్రాల ప్రభుత్వాలు జనారోగ్యం దృష్ట్యా రాజకీయ చతురత కాకుండా పాలనా సామర్థ్యంతో వ్యవహరించి జన రక్షణకు కట్టుబడాలి. ఇందుకు బడ్జెట్లు, ఇజాలు అడ్డురాకూడదు. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. ప్రాణాలు కాపాడలేకపోతే, ఆరోగ్య భద్రత కల్పించకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అర్థం లేదు.

మీడియా.. జనంలో ధైర్యం నింపాలి
భావప్రకటనా స్వేచ్ఛ పేరిట మీడియా ప్రత్యేక వంటకాలు.. ప్రజలను మహమ్మారి పట్ల అప్రమత్తం చేస్తూ, చైతన్యం తీసుకురావడానికి అనువుగా ఉండాలే తప్ప ‘అంతా తమకే తెలుసు’ అన్నట్టు రోజుకో భయానక స్టోరీలు ఇవ్వడం మానేయాలి(ఈ తరహా కథనాలను వండి వారుస్తున్న మీడియా వారికి మాత్రమే ఈ వ్యాఖ్య వర్తిస్తుందని మనవి). వీలైతే పాజిటివ్ సమాచారాన్ని, నలుగురికీ సాయం చేస్తున్న పరోపకారుల గురించి కవరేజ్ కు ప్రాధాన్యత ఇవ్వగలరేమో ఆలోచన చెయ్యాలి. వాస్తవాలు చెప్పవద్దని, లోపాలు దాచిపెట్టమనీ కాదు. ప్రీకన్సీవ్డ్ ఒపీనియన్ తో పాలకుల పనిపట్టే ప్రయత్నం చేస్తున్నామన్న ధోరణికి ప్రస్తుతానికైనా స్వస్తి చెప్పి కరోనా పీడిత జనానికి ధైర్యం చెప్పగల వార్తాంశాలకు ప్రాధాన్యం ఇస్తారేమో అని ఆశ.

సోషల్​ మీడియాకు దూరంగా ఉంటే మంచిది
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చేస్తున్న విష వ్యాఖ్యానాలు, పుకార్లకు జనం దూరంగా ఉంటే అంతకు మించిన ఆరోగ్య కవచం మరొకటి ఉండదు. కాలక్షేపానికి ‘కల్మష’ సోషల్ మీడియాని ఫాలో అయి లేని రోగాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? సుద్ధులు చెప్పడం కాదు కానీ, రెక్కాడితే కాని డొక్కాడని సామాన్య, మధ్య తరగతి జనం ఆర్థికంగా చితికిపోకుండా పాలకులు ఆదుకునేందుకు టాప్ ప్రయారిటీ ఇస్తే కాదనేది ఎవరు? కరోనా మహమ్మారితో నిస్సహాయంగా ఒంటరి యుద్ధం చేస్తున్న ప్రజల పక్షాన పాలకులు రక్షణగా నిలిచి తమకు రాజ్యాధికారం కట్టబెట్టిన జనం రుణం తీర్చుకునే సమయం ఇది. Please stop blame game and work together.

ట్విట్టర్​ కామెంట్లు కాదు.. సలహాలు ఇవ్వాలి
ప్రతిపక్షాలు కూడా సన్నాయి నొక్కులు, ట్విటర్ కామెంట్లు మాని ఆచరణ సాధ్యమైన సలహాలు ఇవ్వాలి. పాలకులు వాటిని రిసీవ్​ చేసుకోవాలి. పాలకులు, ప్రతిపక్షాలు పబ్లిసిటీకీ, పొలిటికల్ మైలేజీకీ పాకులాడకుండా చిత్తశుద్ధితో కదిలితే తప్ప కరోనా నుంచి ప్రజలకు విముక్తి లభించదు. ఇక రీసెర్చ్ సంస్థలు, సలహాదారు వ్యవస్థలు తమ పరిశోధనలతో ప్రజల్ని మరింత భయపెట్టి, అసలే అర్థం కాకుండా దెబ్బతీస్తున్న కరోనా గురించి తెలియని విషయాలన్నింటినీ మీడియా ముందుంచి గందరగోళం సృష్టించకుండా, తమ పరిశోధనాంశాల్లో వెల్లడవుతున్న వాస్తవాలను ప్రభుత్వాలకు నివేదించి వీలైతే విరుగుడు మార్గాలు సూచించాలి. లేకపోతే ఇలాంటి వార్తల వల్ల అసలే భయాందోళనలతో గడుపుతున్న జనాన్ని మరింత హడలగొట్టడమే అవుతుంది.

బ్లేమ్​ గేమ్​ పక్కన పెట్టాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసి ప్రజలకు నిజంగా మేలు చేయదలచుకుంటే కలసికట్టు వ్యూహం రచించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. ‘బ్లేమ్ గేమ్’ ధోరణి పక్కన పెట్టాలి. ఆరోగ్యం ఉమ్మడి అంశం కాబట్టి కేంద్రం రాష్ట్రాలపై నెపం వేయడం, రాష్ట్రాలు(బీజేపీ యేతర) కేంద్రాన్ని తప్పుపట్టడం ఆపి ‘ఉమ్మడి’ ప్రణాళిక గురించి ఆలోచన చేయాలి. ప్రధాని నేతృత్వంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గైడెన్స్ లో వ్యూహం అమలు కావాలి. ఇందుకు చిత్తశుద్ధి, ఒకరిపై మరొకరికి విశ్వాసం అవసరం. ఇజాలు పక్కన పెట్టి వ్యవహరించాలి. ‘యుద్ధప్రాతిపదిక’న చర్యలు తీసుకుంటున్నామన్న మాట పాలకుల నుంచి తరచు వింటూనే ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన అంటే యుద్ధ రంగంలో శత్రువుపై విజయమే ధ్యేయంగా పని చేయాలి తప్ప కేంద్ర, రాష్ట్రాలు ఒకరినొకరు శత్రువులుగా భావించి ‘నెప రాజకీయం’ చేస్తే వాస్తవమైన శత్రువుకు బందీ కాకతప్పదు. జనానికి కావలసిన నిత్యావసరాలు, సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ తప్ప, మిగిలిన శాఖల బడ్జెట్ లో కనీస అవసరాలకు తప్ప ఇతర నిధుల్లో సింహ భాగం కరోనాపై యుద్ధానికే ఖర్చు చెయ్యాలి. రాజ్యాంగం ఒప్పుకోదనుకుంటే ఇందుకోసం ఓ రాజ్యాంగ సవరణ చేస్తామంటే అడ్డుపడే వారుంటారా? దేశ రక్షణ కోసం ఇస్తున్న ప్రాధాన్యం మహమ్మారిని తరిమికొట్టడానికి కూడా ఇవ్వాలి. 

- బీఎస్​ రామకృష్ణ, సీనియర్​ జర్నలిస్ట్