ఇందిరమ్మ ఇండ్లకు లోన్ వచ్చింది.. తొలిదశలో రూ.850 కోట్లు రిలీజ్ చేసిన హడ్కో

ఇందిరమ్మ ఇండ్లకు లోన్ వచ్చింది.. తొలిదశలో రూ.850 కోట్లు రిలీజ్ చేసిన హడ్కో
  • కోడ్​ ముగిసిన తరువాత లబ్ధిదారుల ఎంపిక
  • ప్రజాపాలనలో ఇండ్లకు 65 లక్షల అప్లికేషన్లు
  • పాత బకాయిలు రూ.200 కోట్లు విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు లోన్  సాంక్షన్  అయింది.  హడ్కో ( హౌసింగ్  అండ్  అర్బన్  డెవలప్ మెంట్  కార్పొరేషన్) నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు గత నెల 5న రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్  డిపార్ట్ మెంట్ కు అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇండ్లను (అర్బన్ లో 57,141, రూరల్ లో 38,094 ) నిర్మిస్తామని హడ్కోను అధికారులు సంప్రదించగా  తొలి త్రైమాసికంలో  రూ.850 కోట్లను రెండు రోజుల క్రితం సాంక్షన్  చేశారని అధికార వర్గాలు తెలిపాయి. మరో రెండు దశల్లో మిగతా రుణాన్ని విడుదల చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారులకు బీఆర్ఎస్  సర్కారు డబుల్  బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసింది. వాటి వివరాలను కేంద్రానికి పంపడంతో రూ.200 కోట్లు కేంద్రం నుంచి రాష్ర్ట ప్రభుత్వానికి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. 

ఈ నిధులతో కలుపుకొని తాజాగా విడుదలైన రూ.850 కోట్ల నిధులతో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  అమలుకు వెయ్యి కోట్లపైనే నిధులు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్  అమల్లో ఉన్నందున కోడ్  ముగిసిన వెంటనే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  అమలు స్పీడప్  కానుంది. ఇప్పటికే ఇండ్లు కావాలని ప్రజాపాలనలో పబ్లిక్  నుంచి మొత్తం 83 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అందులో గతంలో డబుల్  బెడ్ రూమ్ , ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారి అప్లికేషన్లను ఫిల్టర్  చేయడంతో 65లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. స్కీమ్  గైడ్ లైన్స్  ప్రకారం అర్హత ఉన్న అప్లికేషన్లను  మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారులు మరోసారి ఫిల్టర్  చేయనున్నారు. 

అనంతరం  నియోజకవర్గాల వారీగా జిల్లా ఇన్ చార్జ్  మంత్రి లబ్ధిదారులను సెలెక్ట్  చేసి గ్రామసభలో తుది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి ఇంటి మంజూరు సర్టిఫికెట్లు అందిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడులో ఈ స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. తొలిదశలో సొంత జాగా ఉన్న వారికే ఇండ్లు ఇవ్వనున్నారు.