- కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు
- ఇంకొన్ని చోట్ల బీజేపీ, సీపీఎం, టీడీపీతో బీఆర్ఎస్ జట్టు
- నామినేషన్లు మొదలుకావడంతో అభ్యర్థుల ఎంపిక స్పీడప్
- అధికారపార్టీలో రంగంలోకి ఇన్చార్జి మంత్రులు
- వచ్చే నెల 2న బీఫాంలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు
- బీఆర్ఎస్, బీజేపీల్లో తుదిదశకు అభ్యర్థుల ఎంపిక
- అభ్యర్థులెవరో తేల్చకపోవడంతో పెద్దసంఖ్యలో
- నామినేషన్లు వేస్తున్న ఆశావహులు
వెలుగు, నెట్వర్క్: మున్సిపల్ ఎన్నికల్లో ‘లోకల్’ పొత్తులు పొడుస్తున్నాయి. హైకమాండ్స్థాయిలో పొత్తులపై ఎటూ తేల్చని ప్రధాన పార్టీలు.. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై నిర్ణయం తీసుకుంటున్నాయి. అధికార పార్టీ కొన్నిచోట్ల సీపీఐతో, ఇంకొన్ని చోట్ల సీపీఎంతో జట్టుకడ్తోంటే, బీఆర్ఎస్ కొన్నిచోట్ల బీజేపీతో, ఇంకొన్నిచోట్ల సీపీఎం, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటోంది. కాగా, ఈసారి ఒంటరిపోరుకు సిద్ధమవుతున్న మజ్లిస్.. ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు బోధన్, భైంసా లాంటి మున్సిపాలిటీలపై కన్నేసింది.
ఎప్పట్లాగే తలోదారిలో వెళ్తున్న రెండు లెఫ్ట్ పార్టీల్లో సీపీఎం తీరు విస్తుగొలుపుతోంది. ఈ పార్టీ కొన్నిచోట్ల కాంగ్రెస్‌తో, ఇంకొన్ని చోట్ల బీఆర్ఎస్తో జతకడ్తోంది. మరోవైపు టీడీపీ అంటే ఇంత ఎత్తున లేచే బీఆర్ఎస్ పార్టీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల బాబు పార్టీతో పొత్తుకు వెంపర్లాడుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కాగా, నామినేషన్లు మొదలుకావడంతో అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు స్పీడప్ చేశాయి. అధికారపార్టీ తరుపున రంగంలోకి దిగిన ఇన్చార్జి మంత్రులు.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలవారీగా అభ్యర్థుల తుది జాబితాలను సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు.
వచ్చే నెల 2న సీఎం విదేశీ పర్యటన ముగించుకొని రానుండగా, అదే రోజు సాయంత్రం బీఫాంలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరడంతో ఒకటి, రెండు రోజుల్లో లిస్టులు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులపై క్లారిటీ రాకపోవడంతో ఆశాహులంతా పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండంతో చివరి నిమిషంలో టికెట్ దక్కని వాళ్లంతా ఎక్కడ రెబల్స్ గా మారుతారోననే టెన్షన్ అధికారపార్టీని వెంటాడుతోంది.
ఎక్కడి పొత్తులు అక్కడే..
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ , సీపీఎం పార్టీల నడుమ పొత్తు కుదిరింది. చేర్యాల మూడో వార్డును సీపీఎం కు కేటాయించగా, బీఆర్ఎస్ పాలక వర్గం ఏర్పడితే కో ఆప్షన్ పదవిని సీపీఎం కు కేటాయించాలని నిర్ణయించారు. జనగామ లో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న సీపీఎం, అదే అసెంబ్లీ నియోజకవర్గంలోని చేర్యాల మున్సిపాల్టీ లో మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకోవడం విశేషం. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ పార్టీతోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 18 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను రిలీజ్ చేసింది. సీపీఐతో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో మిగిలిన వార్డులను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, సీపీఎం నడుమ పొత్తులు ఖరారయ్యాయి. ఒకవేళ సీపీఐ వస్తే కలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే అభ్యర్థులను ప్రకటించడం లేదని సమాచారం. భద్రాద్రికొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై రెండు రోజులుగా జరిగిన చర్చలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి.
ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు ఖరారైంది. ఇదే జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్, టీడీపీ మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతుండగా, ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ మధ్య మంతనాలు జరుపుతున్నారు. నల్గొండ కార్పొరేషన్ లో బీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు ఖరారైంది. బుధవారం 18 మంది అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విడుదల చేయగా, వీరిలో ఒకరు సీపీఎం అభ్యర్థి ఉండడం గమనార్హం.
వనపర్తి మున్సిపాలిటీ లోనూ బీఆర్ఎస్, సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ18, 21 వార్డులను సీపీఎంకు ఆ పార్టీ కేటాయించింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీఆర్ ఎస్, బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. భూపాలపల్లి లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తులు కొలిక్కివచ్చాయి. 24 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో సీపీఐ, సీపీఎంకు ఒక వార్డు కేటాయించారు. మెదక్ మున్సిపాలిటీ లో 32 వార్డులు ఉండగా బీజేపీ కి 10 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. దీంతో మిగిలిన వార్డుల్లో బీఆర్ ఎస్ కు లోపాయికారీగా మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.
నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మద్దూరు, మహబూబ్నగర్జిల్లాలోని దేవరకద్రలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బీజేపీ నుంచి, బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను నిలిపి సహకరించుకోవాలని, ఎన్నికల తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్థానాలు పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఉదయం బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఓ ఫాం హౌస్‌లో సమావేశమై చేతులు కలిపారు.
బీఆర్ఎస్లో తుది దశకు అభ్యర్థుల ఎంపిక..
మున్సిపల్‌ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలిచేందుకు కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్.. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇన్చార్జీలను నియమించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి ప్రచారం వరకు అన్ని బాధ్యతలను వారికే అప్పగించారు. ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో అభ్యర్థుల ఎంపికను స్పీడప్చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరిందని, కొన్ని చోట్ల బీఫాంలు కూడా ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళిపై పర్యవేక్షణ కోసం తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఓ పది మంది వరకు కో ఆర్డినేటర్లు ఇక్కడి నుంచి అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బస్తీబాట కార్యక్రమాన్ని పార్టీ నేతలు చేపట్టారు. కొన్ని చోట్ల బీజేపీతో సయోధ్య కుదుర్చుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రచారానికి తక్కువ సమయంఉండడంతో బహిరంగ సభల్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన చోట్ల కేటీఆర్, హరీశ్ రావులు ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది
బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో స్పెషల్ వార్ రూమ్
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్ పెంచింది. టీడీపీ, జనసేనతో పొత్తుల పంచాయితీ అంతా ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉందని, జాతీయ నేతలే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. ఈలోగా క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీలకు ఇన్ చార్జీలను నియమించి, ప్రతిరోజూ వారితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. టికెట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 300 స్థానాల్లో సింగిల్ అప్లికేషన్లు వచ్చాయని, అభ్యర్థులుగా వారు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బుధవారం రాత్రికి 850 మందితో కూడిన పూర్తి జాబితాను సిద్ధం చేసి, మరో రెండు, మూడు రోజుల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోపక్క కనీసం ఐదు కార్పొరేషన్లు, 30కి పైగా మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. క్యాడర్‌లో జోష్ నింపేందుకు నార్త్, సౌత్ తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. నిర్మల్, మహబూబ్ నగర్ లలో పెట్టే అవకాశాలున్నాయి , సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఒంటరిగానే మజ్లిస్..
ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, భైంసా, బోధన్లాంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎంఐఎం టార్గెట్చేసింది. ఆయాచోట్ల ఎలాగైనా మేయర్ , మున్సిపల్‌చైర్‌పర్సన్ పదవులను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ నాలుగు చోట్లే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఒంటరిగా పోటీచేసి, గెలిచే స్థానాలను బట్టి మేయర్, మున్సిపల్‌చైర్‌పర్సన్ లేదంటే డిప్యూటీ మేయర్, మున్సిపల్వైస్చైర్ పర్సన్లాంటి పదవుల కోసం డిమాండ్‌చేసి సాధించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష పొత్తులు ఉండవని మజ్లిస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్వర్గాల నుంచి ఇదే టాక్ వినిపిస్తోంది. ఒకవేళఈ రెండు పార్టీల నడుమ పొత్తు ఉండకపోతే ముస్లిం మైనారిటీల ఓట్లు కాంగ్రెస్, మజ్లిస్ మధ్య చీలి ప్రత్యర్థి పార్టీలకు లాభం జరిగే అవకాశం ఉంది. దీంతో నష్ట నివారణకు కాంగ్రెస్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
2న కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్‌లు..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను స్పీడప్ చేశాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30దాకా గడువుంది. వచ్చే నెల 3కల్లా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆలోగా పార్టీలు అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి బీఫాంలు అందజేయాల్సి ఉంటుంది. పార్టీలేవీ తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో వార్డుల్లో ఒక్కో పార్టీ నుంచి నలుగురైదుగురు తామే అభ్యర్థులమంటూ ఆయా జెండాలను పట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు.
అధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీంతో ఈ గందరగోళానికి తెరదించేందుకు కాంగ్రెస్ హైకమాండ్రంగంలోకి దిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ 30వ తేదీ కల్లా అభ్యర్థులను ఫైనల్ చేసి లిస్టులు పంపించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశించారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు పూర్తిచేసిన ఇన్చార్జి మంత్రులు, తాజాగా బుధవారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఓవైపు క్యాండిడేట్ల లిస్టులను ఫైనల్ చేస్తూనే అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. విదేశీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2న హైదరాబాద్ తిరిగివస్తారు. ఆయన ఆమోదం తీసుకున్నాక అదే రోజు సాయంత్రం బీ ఫామ్‌లు ఇవ్వాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. మరోవైపు సీపీఐ, టీజేఎస్ పార్టీలతో పొత్తులుంటాయని, చర్చలు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
లెఫ్ట్ పార్టీల తలోదారి..
మున్సిపల్ పోరులో లెఫ్ట్ పార్టీలు తలో దారిలో వెళ్తున్నాయి. సభలు, సమావేశాల్లో కమ్యూనిస్టులం కలిసి పోటీ చేస్తామని చెబుతున్నా.. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం నిర్ణయించగా.. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కోసం గట్టిగా పట్టుబడుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌పై కన్నేసిన సీపీఐ నేతలు, ఇక్కడ తమకు బలమైన క్యాడర్ ఉన్నందున మేయర్ పదవిని తమకే కేటాయించాలని పట్టుపడ్తున్నారు. ఒకవేళ మేయర్ పదవి సాధ్యం కాకపోతే.. కనీసం డిప్యూటీ మేయర్ పదవి అయినా ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే పలు దఫాలుగా మంతనాలు జరిపినా.. అధికార పార్టీ నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాలేదు.
