ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో‘లోకల్’ రిజర్వేషన్లు ఖరారు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో‘లోకల్’ రిజర్వేషన్లు ఖరారు..
  • అన్ని కేటగిరీల్లో బీసీలకు 42 శాతం కేటాయింపు
  • రిజర్వేషన్లు వెల్లడించిన కలెక్టర్లు
  • మహిళలకు 50 శాతం సీట్లు

ఆదిలాబాద్/నిర్మల్/మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: ​ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లోకల్ బాడీస్​రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. ఆదిలాబాద్​జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డుల సభ్యుల రిజర్వేషన్లు ఆయా పార్టీల సమక్షంలో వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం​ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 

ఈసారి బీసీలకు 42 శాతం కలిపి మొత్తం 69 శాతం సీట్లను రిజర్వ్ చేశారు. మొత్తం సీట్లలో మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలుడగా బీసీలకు 8, ఎస్టీలకు 8, ఎస్సీలకు 2, జనరల్​కు 2 స్థానాలు ఖరారు చేశారు. జిల్లాలో ఎంపీటీసీ 166, ఎంపీపీ 20, గ్రామ పంచాయతీలు 473, వార్డులు సభ్యులు 3,870 స్థానాలకు సైతం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కలెక్టర్ల ఆధ్వర్యంలో.. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో వార్డు మెంబర్ల స్థానాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఖరారు చేశారు. ఈ లెక్కన జిల్లాలో 16 మండలాలకు గాను జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్టీ
లకు రెండు, ఎస్సీలకు నాలుగు, బీసీలకు ఏడు, జనరల్​కు మూడు సీట్ల చొప్పున కేటాయించారు.

 వీటిలో ఏడు సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. అన్ని స్థానాల్లో 2019లో ఉన్న రిజర్వేషన్లను ఈసారి మార్చారు. ఆసిఫాబాద్​కలెక్టరేట్​లో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అధికారులు కలిసి జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు చేశారు.  నిర్మల్ జిల్లాలో ఉన్న 18 జడ్పీటీసీ పదవుల్లో ఎనిమిదిటిని బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మూడేసి చొప్పున రిజర్వ్​ చేశారు. నాలుగింటిని జనరల్​కు కేటాయించారు. 4 ఎంపీపీ సీట్లను బీసీ మహిళలకు, 4 బీసీ జనరల్​కు, ఎస్సీ జనరల్​కు 3, ఎస్సీ మహిళకు 1,  ఎస్టీ జనరల్​1, ఎస్టీ మహిళకు 1, 2 జనరల్, మరో 2 జనరల్​మహిళలకు కేటాయించారు.