
- బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు కసరత్తు
- ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ తో పల్లెల్లో వేడెక్కిన రాజకీయం
- ఆసిఫాబాద్ జిల్లాలో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలు
- రెండు విడతల్లో ఎన్నికలు
ఆసిఫాబాద్, వెలుగు: ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారా.. ఆ మండలంలో బలమైన వ్యక్తి ఎవరు.. ఆ క్లస్టర్ లో ప్రజలతో సంబంధం కలిగినవారు ఎవరు.. ఆర్థికంగా బలంగా ఉన్నదెవరు.. ఒకవేళ టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత మన పార్టీలోనే ఉంటారా.. జంప్ అవుతారా.. ఇలా అన్ని కోణాల్లో అభ్యర్థుల బలాలపై ఆరా తీస్తూ ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల అధికార పీఠాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉండగా, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మండల స్థాయి లీడర్లను ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సామాజిక వర్గాలు, కులాలు, పరపతి, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని టిక్కెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
335 గ్రామ పంచాయతీలు..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్దానాలకు రెండు విడతల్లో, 335 గ్రామ పంచాయతీలు, 2,875 వార్డులకు మూడు విడతల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మొదటి విడత ఈ నెల 23న ,రెండో విడత 27న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు మొదటి విడత 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహించనున్నారు.
నమ్మకస్తుల కోసం బీఆర్ఎస్..
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బీఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఆ పార్టీలోనూ మండలాల స్థాయిలో బలమైన నాయకులు ఉండటంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఉండేందుకు పార్టీ పట్ల విధేయత, నమ్మకస్తులకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోంది.
నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు..
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఆశావహులు నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. టికెట్తమకే ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటి మెజార్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. కచ్చితంగా గెలుస్తారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైన వారికే టికెట్లు కేటాయించాలని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. జెండాలు మోసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న ఆయా పార్టీలు ఒక్కో స్థానం నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లు తీసుకుంటూ వారి గెలుపు అవకాశాలపై ఆరా తీస్తున్నాయి.