ఫ్రీ ఇసుకకు ఆఫీసర్ల అడ్డు.. ఆగిపోతున్న ఇంటి నిర్మాణాలు

ఫ్రీ ఇసుకకు ఆఫీసర్ల అడ్డు.. ఆగిపోతున్న ఇంటి నిర్మాణాలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : గ్రామాల్లో ఇసుక కొరత తీర్చి, ఇంటి నిర్మాణాలు ఆగిపోకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ ఇసుక స్కీం పలు చోట్ల అమలుకు నోచుకోవడం లేదు. ఫ్రీ ఇసుకకు సంబంధించి సర్కార్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలిచ్చినా స్థానిక ఆఫీసర్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎవరికి ఇసుక కావాలన్నా తప్పనిసరిగా పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాల్సిందేనని, లేదంటే కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఎప్పట్లాగే ఇసుక దందా జోరుగా సాగుతోంది.

మార్చి 23నే సర్కార్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు

ఫ్రీ ఇసుక స్కీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తూ మార్చి 23న సర్కార్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. గ్రామాల్లో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్థానిక అవసరాలకు వాగుల నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకోవచ్చని ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఈ మేరకు మైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్ జియాలజీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ముఖ్య కార్యదర్శి మహేశ్‌‌‌‌‌‌‌‌ దత్‌‌‌‌‌‌‌‌ ఎక్కా కలెక్టర్లకు సైతం ఆదేశాలు జారీ చేశారు.  ఫ్రీ ఇసుక స్కీంకు సంబంధించి సర్కార్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసి 13 రోజులు దాటుతున్నా కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తమ జిల్లా పరిధిలోని రెవెన్యూ, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు ఎలాంటి గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. దీంతో గ్రామాల్లో ప్రస్తుతం పాత పద్ధతులే పాటిస్తున్నారు.

ఆదేశాలు అందలేదంటున్న ఆఫీసర్లు

రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో లోకల్‌‌‌‌‌‌‌‌గా అనేక చోట్ల వాగులు ఉన్నాయి. వీటిపై తహసీల్దార్లు, పోలీసుల పెత్తనమే అధికంగా ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఎవరైనా ఇసుక తీసుకునేందుకు వాగుల్లోకి వస్తే ఆఫీసర్లు ట్రాక్టర్లను సీజ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు, కేసులు నమోదు చేస్తున్నారు. ఫ్రీ ఇసుక స్కీమ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కలెక్టర్ల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారు. పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కోసం చెప్పులరిగిలేలా తిరుగుతున్నా తట్టెడు ఇసుక తీసుకునేందుకు కూడా పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు. దీంతో గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోతున్నాయి. 

చక్రం తిప్పుతున్న ఇసుక వ్యాపారులు 

బ్లాక్‌‌‌‌‌‌‌‌లో ఇసుక అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దొడ్డు రకం ఇసుక అయితే టన్ను రూ.వెయ్యి నుంచి రూ.1,500, సన్న ఇసుక అయితే టన్నుకు రూ.1,500 నుంచి రూ.2000 పలుకుతోంది. సర్కారు ఇచ్చిన ఆదేశాలతో ఫ్రీగా ఇసుక దొరుకుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఇసుక వ్యాపారులు మైనింగ్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఉన్న రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచే కాకుండా లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగుల నుంచి కూడా అక్రమంగా ఇసుక తీసుకొచ్చి అవసరమైన వారికి అమ్ముతున్నారు. ఈ వ్యాపారులే ఫ్రీ ఇసుకకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్లను మేనేజ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ పేదలు, స్థానిక గ్రామస్తులకు ఇసుక అందకుండా చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ నాలుగు గదులతో ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. స్లాబ్‌‌‌‌‌‌‌‌ వేసే ఉద్దేశంతో సెంట్రింగ్‌‌‌‌‌‌‌‌ పని సైతం పూర్తి చేశాడు. స్లాబ్‌‌‌‌‌‌‌‌ వేసేందుకు సుమారు 10 టన్నుల ఇసుక అవసరం అవుతుంది. ఊరు పక్కనే చలివాగు ఉండడంతో అక్కడి నుంచి ఇసుక తోలుకునేందుకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని రెవెన్యూ, పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల చుట్టూ తిరిగినా వారు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు. బ్లాక్‌‌‌‌‌‌‌‌లో కొందామంటే టన్ను ఇసుక రూ. 1,600 చెబుతున్నారు. అన్ని డబ్బులు పెట్టి ఇసుక కొనలేకపోవడంతో ఇంటి నిర్మాణం ఆగిపోయింది. 

భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన బండారి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ కొత్తగా ఇల్లు కట్టాలని నిర్ణయించి స్లాబ్‌‌‌‌‌‌‌‌ వరకు పూర్తి చేశాడు. గోడలు కట్టి గిలాబు చేసేందుకు సన్న ఇసుక కావాలని నెల రోజులుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నడు. బయట అడిగితే టన్నుకు రూ.1,800 ఇస్తే ఇంటికి తీసుకొచ్చి పోస్తామని చెబుతున్నారు. దీంతో కేవలం ఇసుకకే రూ.50 వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో ఇంటి నిర్మాణాన్ని ఆపేశాడు. ఇంతలో ఇండ్ల నిర్మాణాలకు ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా వాగుల్లో ఇసుక తీసుకొవచ్చని సర్కారు చెప్పడంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించాడు. కానీ పది రోజులుగా ఆఫీసర్ల చుట్టూ ఎవరూ పట్టించుకోవడం లేదు.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆదేశాలు రాలేదు 

ఇంటి నిర్మాణాలు, స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా వాగుల్లోంచి ఫ్రీగా ఇసుక తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆదేశాలు రాలేదు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ నుంచి గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ వస్తేనే మేము ఫ్రీ ఇసుకకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తాం. అప్పటిదాకా ఎవరైనా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తాం.

– ఖాజా మొయినొద్దీన్‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిట్యాల, భూపాలపల్లి జిల్లా