నీట్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లకు లాక్ డౌన్.. పరీక్ష పూర్తయ్యే వరకు అజ్ఞాతంలోనే.. నో ఫోన్, నో కమ్యూనికేషన్

నీట్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లకు లాక్ డౌన్..  పరీక్ష పూర్తయ్యే వరకు అజ్ఞాతంలోనే.. నో ఫోన్, నో కమ్యూనికేషన్

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా రచ్చలేపుతున్న క్రమంలో కేంద్ర విద్యాశాఖ, NTA (National Testing Agency) కీలక నిర్ణయం తీసుకున్నాయి. నీట్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లకు లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి పేపర్ లీకేజీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ కఠిన నిర్ణయంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. 

లాక్ డౌన్ పరీక్ష పూర్తయ్యేలోపు కొనసాగనుంది. అంటే జూన్ 21న పరీక్ష పూర్తయ్యేలోపు అజ్ఞాతంలోనే ఉండాల్సి వస్తుంది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వీరికి బయటి సమాజంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటివి లేకుండా.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలి. 

2026 మే నెలలో జరిగిన NEET-UG పరీక్ష పేపర్లు లీకవ్వటంతో 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

ప్రజల నుంచి రోజురోజుకు ఆగ్రహం ఎక్కువవుతున్న తరుణంలో.. కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా.. కేవలం లాక్ డౌన్ అనేది ఒక్కటే కాకుండా.. వివిధ దశలలో ప్రశ్నాపత్రాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

లాక్ డౌన్ లో ఉన్న అధ్యాపకులకు ఫోన్ తో పాటు.. ఇంటర్నెట్ సదుపాయం లాంటివి ఏవీ ఉండవు. వారి దగ్గరికి వచ్చి పోయేవారిని ఎల్లప్పుడూ కెమెరా నిఘాలో పర్యవేక్షిస్తుంటారు. కేవలం ప్రభుత్వం అనుమతించిన వారినే వారి దగ్గరకు ప్రవేశం ఇస్తారు. 

నీట్ పరీక్ష జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటలకు జరగనుంది. మొత్తం ఇండియాలో 551 సిటీలలో.. అలాగే విదేశాలలో 14 సిటీలలో పరీక్ష నిర్వహించనున్నారు.