తమిళనాడులో ఈ నెల 14 వరకు లాక్‌ డౌన్‌ పొడగింపు

తమిళనాడులో ఈ నెల 14 వరకు లాక్‌ డౌన్‌ పొడగింపు

తమిళనాడులో మళ్లీ మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 14వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న లాక్ డౌన్ సడలింపులే ఇప్పుడు కూడా వర్తిస్తాయని తెలిపింది. 11 జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సడలింపులుంటాయని ప్రభుత్వం తెలిపింది.
కిరాణ షాపులు, చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు, పూల షాపులు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పని చేయనున్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌, మాల్స్‌, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్‌, సెలూన్ షాపులకు రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేదు. కోయంబత్తూర్‌, నీలగిరి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, కరూర్‌, నమక్కల్‌, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మాయిలదుతూరై జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.