రాష్ట్రంలో మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్ డౌన్‌: బీహార్ డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్ డౌన్‌: బీహార్ డిప్యూటీ సీఎం

కొద్ది రోజులుగా క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 16 నుంచి 31 వ‌ర‌కు తిరిగి పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయాల‌ని నిర్ణ‌యించింది. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌పై మిన‌హా మిగిలిన అన్ని ప‌నుల‌పై క‌ఠిన ఆంక్ష‌లు విధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ఈ రోజు ఉద‌యం హైలెవ‌ల్ మీటింగ్ నిర్వ‌హించి లాక్ డౌన్‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ విధిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. క‌ఠినంగా ఆంక్ష‌లు పాటించాల‌ని, ప్ర‌జ‌లెవ‌రూ అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆయ‌న కోరారు. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమ‌లుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు.

ఇద్ద‌రు మంత్రులు.. 75 మంది బీజేపీ నేత‌ల‌కు క‌రోనా

బీహార్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 17,959 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో 12,317 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 5,482 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించిన త‌ర్వాత రాష్ట్రంలో భారీగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మ‌ళ్లీ క‌ఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాల‌ని నిర్ణ‌యించింది బీహార్ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మంత్రుల‌కు కరోనా సోకింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్, రూర‌ల్ వ‌ర్క్స్ శాఖ మంత్రి శైలేశ్ కుమార్ ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. పాట్నాలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో నిన్న 100 మందికి క‌రోనా టెస్టు చేయ‌గా.. బీహార్ బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ దేవేశ్ కుమార్, ఎమ్మెల్సీ రాధామోహ‌న్ శ‌ర్మ స‌హా 75 మంది నేత‌ల‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.