ఏప్రిల్ 19 నుంచి 21 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ

ఏప్రిల్ 19 నుంచి 21 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ
  • 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్​
  • ఫస్ట్​ ఫేజ్​లో పలువురు ప్రముఖుల స్థానాలు
  • 26న సెకండ్ ఫేజ్.. 13 రాష్ట్రాలు. 88 సీట్లు
  • అన్ని ఏర్పాట్లు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్

న్యూఢిల్లీ : లోక్​సభ పోలింగ్ షురూ అయ్యేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి. మొత్తం ఏడు ఫేజ్​లో 543 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19 న ఫస్ట్ ఫేజ్​లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా, ఈ నెల 26న 13 రాష్ట్రాల్లోని 88 లోక్​సభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈమేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 45 రోజుల పాటు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. తొలిదశలో పోలింగ్ జరగబోయే పలు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటున్నారు.

ముఖ్యంగా నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్ గఢ్​ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందిని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈవీఎంలతో పాటు ఇతరత్రా సామగ్రిని కూడా తరలించినట్లు చెప్పారు. కాగా, ఈ రెండు ఫేజ్​ల​లో వివిధ పార్టీలకు చెందిన కీలక అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్), శశిథరూర్ (కాంగ్రెస్), చంద్రశేఖర్ ఆజాద్(ఆజాద్ సమాజ్ పార్టీ), గౌరవ్​ గొగొయ్(కాంగ్రెస్), తోపన్​కుమార్ గొగొయ్​ (బీజేపీ), అన్నామలై (బీజేపీ)

పప్పు యాదవ్ (ఇండిపెండెంట్), సంతోష్ కుమార్ కుశ్వాహ (జేడీయూ), రాజీవ్ చంద్రశేఖర్ (బీజేపీ)తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు ఫస్ట్, సెకండ్ ఫేజ్​లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వీరంతా తమ లోక్​సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు చుట్టేశారు. ముఖ్యంగా తొమ్మిది మంది కీలక నేతల పోలింగ్​పై దేశ ప్రజలంతా దృష్టిపెట్టారు. వీరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశం ఉంది.

స్టేట్ : రాజస్థాన్, ఏప్రిల్​19 (ఫేజ్ 1)

సెగ్మెంట్ : చురు
కీలక అభ్యర్థులు : దేవేంద్ర ఝజారియా (బీజేపీ), రాహుల్ కస్వాన్ (కాంగ్రెస్)
నార్తర్న్ రాజస్థాన్​లోని చురు నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. పారా ఒలింపిక్ లో జావెలిన్​త్రో విభాగంలో రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించిన దేవేంద్ర ఝజారియా బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ అధిష్టానం రాహుల్​కు టికెట్ నిరాకరించడంతో గత మార్చిలోనే కాంగ్రెస్​లో చేరారు. అదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు.

స్టేట్ : ఉత్తరప్రదేశ్, ఏప్రిల్ 19 (ఫేజ్​1)
సెగ్మెంట్ : నగీన
కీలక అభ్యర్థులు : చంద్రశేఖర్ ఆజాద్ (కేఆర్), సురేంద్రపాల్​ సింగ్ (బీఎస్పీ), మనోజ్ కుమార్ (ఎస్​పీ), ఓంకుమార్ (బీజేపీ). 
నగీన సెగ్మెంట్ నుంచి దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ బరిలో ఉన్నారు. ఈ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్. 20% ఎస్సీలు, 43% ముస్లిం ఓటర్లున్నారు. ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా విజయం సాధించలేకపోయింది. దళితుల్లో ప్రధానంగా యువ ఓటర్లను ఆకర్శించే పనిలో రావణ్ ఉన్నాడు. ప్రస్తుతం బీఎస్పీ నేత గిరీశ్ చంద్ర ఎంపీగా కొనసాగుతున్నారు.

స్టేట్ : అస్సాం, ఏప్రిల్ 19 (ఫేజ్ 1)
సెగ్మెంట్ : జోర్హత్
కీలక అభ్యర్థులు : గౌరవ్ గొగొయ్ (కాంగ్రెస్), తోపాన్ ​కుమార్ గొగొయ్ (బీజేపీ)
జోర్హత్ సెగ్మెంట్ కాంగ్రెస్​కు కంచుకోట. 1991 నుంచి 2009 దాకా కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019లో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం తోపాన్ కుమార్ ఎంపీగా ఉన్నారు. ఒకప్పుడు ఈ సెగ్మెంట్ అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగొయ్ (కాంగ్రెస్) ఆధీనంలో ఉండేది. తండ్రి నాయకత్వాన్ని నిలబెట్టేందుకు 2019లో కలియాబోర్ నుంచి గెలిచిన గౌరవ్.. ఈసారి జోర్హత్​లో పోటీ చేస్తున్నాడు.

స్టేట్ : తమిళనాడు, ఏప్రిల్ 19 (ఫేజ్ 1)
సెగ్మెంట్ : కోయంబత్తూరు
కీలక అభ్యర్థులు : గణపతి పి.రాజ్​కుమార్ (డీఎంకే), అన్నామలై (బీజేపీ), సింగాయ్ జి. రామచంద్రణ్ (అన్నాడీఎంకే)
కోయంబత్తూరు సీటును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. పార్టీ స్టేట్ చీఫ్ అన్నామలై బరిలో ఉన్నారు. డీఎంకే నుంచి కోయంబత్తూర్ మాజీ మేయర్ గణపతి రాజ్​కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ అన్నామలైని బరిలో దించడంతో.. పదేండ్ల తర్వాత డీఎంకే తన అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ బరిలో లేకుంటే లెఫ్ట్ పార్టీలకు ఈ సీటు వదిలేసేవారు. అన్నామలైకు టెక్స్​టైల్ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తున్నది.

స్టేట్ : కేరళ, ఏప్రిల్ 26 (ఫేజ్​ 2)
సెగ్మెంట్ : వయనాడ్
కీలక అభ్యర్థులు : యానీ రాజా (సీపీఐ), సురేంద్రన్ (బీజేపీ), రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
2009 నుంచి వయనాడ్​లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నది. 2019లో రాహుల్ గాంధీ 4.3లక్షల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్​కు కంచుకోటగా ఉన్న వయనాడ్​లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. బీజేపీ స్టేట్​ చీఫ్ సురేంద్రన్ బరిలో ఉన్నారు. మైనారిటీ డామినేటెడ్ సీటు. 32శాతం ముస్లింలు, 13 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. సురేంద్రన్ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విస్తృతంగా ప్రచారం చేశారు.

స్టేట్ : బిహార్, ఏప్రిల్ 26, (ఫేజ్ 2)
సెగ్మెంట్ : పూర్ణియ
కీలక అభ్యర్థులు : పప్పు యాదవ్ (ఇండిపెండెంట్), బీమా భారతి (ఆర్జేడీ), సంతోష్ (జేడీయూ).
పూర్ణియలో త్రిముఖ పోరు నెలకొన్నది. 1990 కాలంలో పూర్ణియ ఎంపీగా పప్పు యాదవ్ ఉన్నారు. 20ఏండ్ల తర్వాత మళ్లీ పోటీ చేయాలనుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఇక్కడ 40‌‌‌‌% ముస్లింలు, 23% ఈబీసీ వర్గానికి చెందిన ఓటర్లున్నారు.

స్టేట్ : కేరళ, ఏప్రిల్ 26 (ఫేజ్ 2)
సెగ్మెంట్ : తిరువనంతపురం
కీలక అభ్యర్థులు : శశిథరూర్ (కాంగ్రెస్), రాజీవ్ చంద్రశేఖర్ (బీజేపీ), రవీంద్రన్ (సీపీఐ).
సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్, కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని యూడీఎఫ్ తరఫున అభ్యర్థులు బరిలో ఉండగా.. బీజేపీ పోటీకి దిగడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీగా శశిథరూర్ ఉన్నారు. థరూర్ నెగిటివ్ రిపోర్ట్ కార్డు పట్టుకుని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ 66 % హిందువులు ఉండడం బీజేపీకి ప్లస్ పాయింట్.

స్టేట్ : రాజస్థాన్, ఏప్రిల్ 26 (ఫేజ్2)
సెగ్మెంట్ : బార్మర్- జైసల్మేర్
కీలక అభ్యర్థులు : కైలాశ్ చౌదరి(బీజేపీ), ఉమేదా రామ్(కాంగ్రెస్), రవీంద్ర సింగ్ భాటి (స్వతంత్ర)
ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన రవీంద్ర సింగ్ భాటిపైనే అందరి ఫోకస్ ఉంది. 20‌‌‌‌14, 2019లో బీజేపీ అభ్యర్థులు సోనా రామ్, కైలాశ్ చౌదరి గెలిచిన భాటికి ఆదరణ పెరిగింది. తన వల్ల మోదీని శిక్షించొద్దని సిట్టింగ్ ఎంపీ చౌదరి ప్రచారం చేస్తున్నారు. 20లక్షల ఓటర్లుంటే.. 19% జాట్స్, 12% రాజ్​పుత్​లు ఉన్నారు.

స్టేట్ : కేరళ, ఏప్రిల్ 26 (ఫేజ్ 2)
సెగ్మెంట్ : త్రిస్సూర్
కీలక అభ్యర్థులు : సురేశ్ గోపి (బీజేపీ), మురళీధరన్ (కాంగ్రెస్), వీఎస్ సునీల్ కుమార్ (సీపీఐ)
1952 నుంచి ఒకసారి కమ్యూనిస్టులు గెలిస్తే.. ఇంకోసారి కాంగ్రెస్ గెలుస్తున్నది.ఇప్పటి దాకా బీజేపీ ఇక్కడ విజయం సాధించలేదు. ఈసారి గెలవాలని మోదీ త్రిస్సూర్​లో పలుమార్లు పర్యటించారు. ఆలయాలు సందర్శించారు.