ఘాజీపూర్ నియోజకవర్గం – కులమే కీలకం

ఘాజీపూర్ నియోజకవర్గం – కులమే కీలకం
  • మొత్తం ఓటర్లు : 19 లక్షలు
  • దళితులు : 21 శాతం
  • ముస్లిం లు : 10 శాతం

ఘాజీపూర్‌‌ (యూపీ):ఇక్కడ బాలాకోట్‌‌ విమాన దాడుల ప్రభావం ఉండదు. రాఫెల్‌‌ డీల్‌‌ పై ప్రతిపక్షాల ఆరోపణల్నీ పట్టించుకోరు.  ఉత్తరప్రదేశ్‌‌లోని ఘాజీపూర్‌‌ లోక్‌‌సభ ఎన్నికల్లో  కేవలం కులం కార్డు మాత్రమే గెలుపును నిర్ణయిస్తుందని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టెలికం మంత్రి , బీజేపీ సిట్టింగ్‌‌ ఎంపీ మనోజ్‌‌ సిన్హా  బీఎస్పీ కేండిడేట్‌‌ అఫ్జల్‌‌ అన్సారీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌‌ఎల్డీ కూటమి  అభ్యర్థిగా  అన్సారీ బరిలో ఉన్నారు.  2014 లోక్‌‌సభ ఎన్నికల్లో  ఎస్పీ-బీఎస్పీలకు బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి. సిన్హా 32,400 ఓట్ల మెజార్టీతో గెలిచినా ఆయనకు   మూడు లక్షల ఆరువేల ఓట్లే  పడ్డాయి. అదే ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులకు కలిపి ఐదు లక్షల 16 వేల ఓట్లు పడ్డాయి.దళితులు, ముస్లింలు, ఇతర వెనకబడిన తరగతుల ఓట్లు తమకు పడతాయని కూటమి అంచనా వేస్తోంది.

వెనకబడిన వ్యవసాయ కుటుంబానికి చెందిన నేత అజిత్‌‌ కుమార్‌‌ కుష్వాహాను తమపార్టీ అభ్యర్థిగా పోటీలోకి దింపడంతో  ‘కూటమి’ ఓట్లు చీలిపోతాయని కాంగ్రెస్‌‌ భావిస్తోంది. బీజేపీ అభ్యర్ధి సిన్హా భూమిహార్‌‌ కులానికి చెందినవారు. ఈ కులంవాళ్లు ఉత్తరప్రదేశ్‌‌లో సంఖ్యాపరంగా తక్కువగా ఉంటారు. ప్రచారానికి దూరంగా ఉండే సిన్హా సివిల్‌‌ ఇంజనీర్‌‌. ఐఐటీ -బీహెచ్‌‌యూలో చదువుకున్నారు. ఆయనను వికాశ్‌‌ పురుష్‌‌ అని  మద్దతుదార్లు పిలుస్తారు.  ఈ ప్రాంత అభివృద్ధికాని, బీజేపీ అభివృద్ధి అజెండాకాని ఇక్కడ వర్కవుట్‌‌ కాదని అంటున్నారు. కుల సమీకరణలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఘజియాబాద్‌‌ ఉత్తర ప్రదేశ్‌‌ పూర్వాంచల్‌‌ పరిధిలోకి వస్తుంది. కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ఈ రీజియన్‌‌ నిర్ణయిస్తుందని వారంటున్నారు.