చేవెళ్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

చేవెళ్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
  •     ఓటమి తర్వాత డీలాపడిన బీఆర్ఎస్​  వలసలు, ఎమ్మెల్యేల తీరుతో పడిపోయిన గులాబీ గ్రాఫ్​
  •     బీజేపీ నుంచి  బరిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  •     ఇంకా అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్​, బీఆర్ఎస్
  •     పోటీకి ససేమిరా అంటున్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి
  •     సీఎం ఇన్​చార్జిగా ఉండడంతో గెలుపుపై కాంగ్రెస్ ధీమా
  •     మోదీ ఛరిష్మా, కొండా క్యాడర్​పై బీజేపీ ఆశలు

హైదరాబాద్, వెలుగు: చేవేళ్ల పార్లమెంట్​ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలపరంగా చూసినప్పుడు  బీఆర్ఎస్​, కాంగ్రెస్​ మధ్య నువ్వా, నేనా అనే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారం కోల్పోవడంతో గులాబీ గ్రాఫ్ క్రమంగా​పడిపోతోంది. బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి భారీ వలసలు కొనసాగుతుండడం, గెలిచిన ఎమ్మెల్యేలు సీఎంను కలవడం లాంటి చర్యలతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. మరోవైపు బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. చేవెళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్ ఇన్​చార్జిగా స్వయంగా సీఎం ఉండడంతో ఆ పార్టీ సైతం దూకుడు మీద ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డికే టికెట్​ఖాయమని తెలుస్తోంది. ఆమెకు టికెట్​ ఇస్తే ఈ రెండు పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితే ఉండనుంది. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్​రెడ్డి ఈ సారి పోటీ చేయబోనని బీఆర్ఎస్​ హైకమాండ్​కు స్పష్టం చేయడంతో క్యాడర్​ అయోమయంలో పడింది.

దూకుడు మీద కాంగ్రెస్, బీజేపీ.. 

అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఉన్న బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు గ్రౌండ్ లెవెల్​లో ప్రచారాన్ని స్పీడప్​ చేశాయి. వారం కింద చేవేళ్లలో ప్రజాగర్జన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించి క్యాడర్​ను సమాయాత్తం చేశారు. ఆయన స్వయంగా చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గానికి ఇన్​చార్జీగా ఉండ డంతో గెలుపును పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన జోష్​లో ఉన్న కాంగ్రెస్​లీడర్లు నాలుగు గ్యారంటీల అమలుతో విజయంపై  ధీమాగా ఉన్నారు. పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్​ చూపుతుండడంతో క్యాడర్​లో మరింత ఉత్సాహం పెరిగింది. బీజేపీ కూడా ఇప్పటికే నియోజకవర్గంలో విజయసంకల్పయాత్ర పూర్తి చేసింది. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేయబోతున్న కొండా విశ్వేశ్వర్​రెడ్డికి గతంలో ఇక్కడ ఎంపీగా చేసిన అనుభవం ఉంది.  ఆయన బీఆర్ఎస్​తో పాటు కాంగ్రెస్​లోనూ పని చేశారు. అప్పటి నుంచి ఆయన వెంట నడుస్తున్న క్యాడర్​ను కాపాడుకుంటూ వస్తున్నారు. బీజేపీకి సైతం సంస్థాగత బలం ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. దీనికితోడు మోదీ హవా , రామమందిర నిర్మాణం తమను గెలిపిస్తాయని బీజేపీ  నేతలంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి బి.జనార్దన్​రెడ్డికి 2లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. ఆయన అంత బలమైన అభ్యర్థి కాకపోయినా మోదీ చరిష్మానే ఇందుకు కారణమని, దీనికి  ఇప్పుడు కొండా బలం తోడైతే  గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.  

 రేసులో వెనుకబడిన బీఆర్ఎస్..

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు బీఆర్ఎస్​ను వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతుండడం, అన్ని స్థానాలు కాంగ్రెస్ ​ఖాతాలో పడుతుండడం బీఆర్ఎస్​కు మైనస్​గా మారింది. మేయర్లు, చైర్మన్లు కూడా కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారు. కొందరు బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు తమ అనుచరులను ముందుగా పంపుతున్నారని, ఎన్నికల నాటికి వారు కూడా కాంగ్రెస్​లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు.  ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలతో పాటు ఓడిన వారు కూడా యాక్టివ్ గా లేరు.  

ఎమ్మెల్యేల తీరుతో మారిన సీన్​.. 

చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో బీఆర్​ఎస్​ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా, కాంగ్రెస్​ నుంచి ముగ్గురు విజయం సాధించారు. రాజేంద్ర నగర్ లో బీఆర్ఎస్​నుంచి పోటీ చేసిన ప్రకాశ్ గౌడ్,  చేవెళ్లలో కాలె యాదయ్య, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితా రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్​ తరపున పరిగి నుంచి రామ్మోహన్​రెడ్డి, తాండూరులో మనోహర్​రెడ్డి, వికారాబాద్​లో ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ ​విక్టరీ కొట్టారు. ఎమ్మెల్యేల పరంగా చూస్తే నువ్వా నేనా అన్నట్లు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్​ గ్రాఫ్​ పడిపోతోందని, ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే ప్రధాన పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  దీనికితోడు రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​, చేవెళ్ల శాసనసభ్యుడు యాదయ్య ఈ మధ్య సీఎం రేవంత్​రెడ్డిని కలవడంతో వారు పార్టీ మారుతారన్న ప్రచారం సాగింది. ఇందుకు బలం చేకూర్చేలా రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్ అనుచరులు,  బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్​ క్యాడర్ ​అయోమయంలో పడింది.