లోక్ సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా

లోక్ సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా

పార్లమెంట్ శీతకాల సమావేశాలు నేటితో ముగిసాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23వ తేదీ వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నా.. నేటితోనే నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ స‌మావేశాలకు సంబంధించి ప్ర‌భుత్వ అజెండా పూర్తి కావ‌డంతో పార్లమెంటు ఉభ‌య స‌భ‌ల‌ను బుధవారం  నివ‌ర‌వ‌ధిక వాయిదా వేశారు. అయితే ఈ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. ప్రతిపక్షాల వరుస ఆందోళనలు, నిరసనలతో రాజ్యసభ, లోక్ సభ వేడెక్కాయి. రైతు చట్టాల బిల్లు రద్దుతో ప్రారంభమైన సమావేశాల్లో ఆ తర్వాత రైతులకు కనీస మద్దతు ధర, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వంటి అంశాలపై వరుసగా ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇవ్వడం.. ఆందోళనల నిర్వహించడం చేశాయి.దీంతో పార్లమెంట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అటు లఖీంపూర్ ఖేరీ కేసు విషంయలో సిట్ ఇచ్చిన రిపోర్టుతో పార్లమెంట్ లో మరింత వేడి రాజుకుంది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించారు. అజయ్ మిశ్ర వంటి క్రిమినల్ ను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్నారు. 

ఇక రాజ్యసభలో రగడ కొనసాగింది. 12 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ తో రాజ్యసభ నిత్యం రణరంగంగా మారింది. ఒకానొక స్థాయిలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేసినా కూడా సభ్యుల తీరులో మ ాత్రం ఎలాంటి మార్పు రాలేదు. గత వర్షాకాల సమావేశాల్లో సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డు తగిలారని విపక్షాలకు చెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తోపాటు లెఫ్ట్ పార్టీలు, తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన 12 మంది ఉద్దేశ పూర్వకంగా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని, సభాధ్యక్షుని అధికారాన్ని ఏమాత్రం గౌరవించకుండా అడ్డుకున్నారంటూ వీరిని సస్పెండ్‌ చేశారు. మొత్తం శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరి సస్పెన్షన్‌ అమల్లో ఉంటుంది. అయితే ఈ 12 మంది ఎంపీల సస్పెన్షన్ పై ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో నిత్యం నిరసనకు దిగారు. వెంటనే ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.  అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మెట్టు దిగని పరిస్థితి. ఇలా వరుస నిరసనల నడుమ.. చివరకు ఇవాల్టికి పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శీతకాలం పార్ల‌మెంటు స‌మావేశాలు న‌వంబ‌ర్ 29 నుంచి ప్రారంభం అయ్యాయి. షెడ్యూల్ ఒక రోజు ముందుగానే స‌మావేశాలు ముగిశాయి. 

ఇవి కూడా చదవండి:

బెంగళూరులో భూకంపం

భారత్లో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు