రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో సినిమా.. లోకేష్ కనగరాజ్ ఏమన్నారంటే?

రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో సినిమా.. లోకేష్ కనగరాజ్ ఏమన్నారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ ,  దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం ' కూలీ'.  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. దూసుకెళ్తోంది.  భారీ తారాగణంతో వచ్చిన ఈమూవీ అత్యధిక వసూలు చేసిన తమిళ చిత్రంగా రికార్డులు సృష్టించింది.  ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ తదుపరి చిత్రంపై ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.   రజనీకాంత్, కమల్ హాసన్  కాంబోలో ఓ మూవీ రాబోతోందని, దీనికి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్  చేయబోతున్నారంటూ  కథనాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి 'కూలీ' తర్వాత లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కార్తీ నటించిన 'కైతి2' మూవీని మొదలుపెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రణాళిక అంతా మారే అవకాశం ఉందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.' కూలీ' విడుదలకు ముందే లోకేష్ ఒక కథను కమల్ హాసన్, రజనీకాంత్ లకు వినిపించారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సన్ పిక్సర్స్ కూడా చర్చలు జరుపుతున్నాయని సమాచారం.   'ఖైదీ 2' ఆలస్యమవుతుందని అటు కార్తీకి కూడా లోకేష్ చెప్పారని, అందుకు ఆయన అంగీకరించాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ALSO READ : ఉమెన్ పవర్ చూపించేలా..

రజనీకాంత్, కమల్ హాసన్ దశాబ్దాలుగా మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒక ఒకరితో ఒకరు ఎప్పుడూ టచ్ లో ఉంటారు.  ఇటీవల లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఒకవేళ వారిద్దరూ కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకుని,  నన్ను పిలిస్తే..  నా చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్టులను వదిలేసి వెళ్తానని చెప్పారు. 'కూలీ' సినిమాలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వంటి ఆగ్ర నటులు కూడా నటించి మెప్పించారు. 

ఇప్పుడు ఒకవేళ ఈ ఇద్దరి కాంబోలో ఈ సినిమా నిజంగా కార్యరూపం దాల్చితే.. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ ఒకే సినిమాలో నటించినట్లు అవుతుంది. చివరిసారిగా వారిద్దరూ 1979లో వచ్చిన ఐ.వి. శశి దర్శకత్వం వహించిన 'అలావుద్దీనం అద్భుత విళక్కుం' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ చిత్రంలో కమల్ హాసన్ కథానాయకుడిగా, రజనీకాంత్ విలన్‌గా నటించారు. ఈ సినిమాలో జయభారతి, శ్రీప్రియ కూడా కీలక పాత్రలు పోషించారు.

 ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ' థగ్ లైఫ్ ' మూవీలో నటించారు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్బరివ్ దర్శకత్వంలో 'KH237', భారతీయుడు 3 చిత్రాలు ఉన్నాయి. అటు రజనీకాంత్ చేతిలో 'జైలర్ 2' ఉంది.  ఈ నేపథ్యంలో రజనీ, కమల్ కాంబో మూవీ ఊహాగానాలకే పరిమితమా.. వాస్తవ రూపం దాల్చుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.