
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నటులుగా, కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవాలుగా నిలిచిన లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్. ఇప్పుడు వీరిద్దరూ ఒకే తెరపై కన్పించబోతున్నారు. 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే సినిమాలో నటించబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సినీవర్గాలతో పాటు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ ధ్రువీకరించడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
లేటెస్ట్ గా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ ( SIIMA Awards 2025 ) కార్యక్రమంలో ఈ శుభవార్తను కమల్ హాసన్ ప్రకటించారు. ఈవెంట్ హోస్ట్ , నటుడు సతీష్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. "మేమిద్దరం ఎప్పుడో కలిసాం, మధ్యలో విడిపోయాం. ఒక బిస్కెట్‌ను విరిచి సగం సగం ఇస్తే, అది మాకు సరిపోలేదు. ఒక్కొక్కరికి ఒక బిస్కెట్ కావాలని కోరుకున్నాం. ఇప్పుడు మళ్లీ సగం బిస్కెట్‌తో సంతృప్తి చెందాం, అందుకే తిరిగి కలిసాం," అంటూ కమల్ హాసన్ చమత్కరించారు.
మా మధ్య ఎప్పుడూ పోటీలేదు.. అది కేవలం మీడియా, ప్రేక్షకులు మాత్రమే సృష్టించినదేనని కమల్ హాసన్ స్పష్టం చేశారు. మాకు అలాంటి అవకాశాలు రావడం చాలా గొప్ప. మేమిద్దరం ఎప్పటినుంచో ఆదర్శంగా ఉండాలని అనుకున్నాం. ఆయన అలాగే ఉన్నారు.. నేను అలాగే ఉన్నాను. అందుకే మా ఈ కలయిక వ్యాపార పరంగా ఆశ్యర్యంగా అనిపించినా.. మాకు అంత ఆశ్చర్యంగా లేదు. చాలా కాలం క్రితం జరగాల్సినది ఇప్పుడు జరగుతున్నందుకు సంతోషంగా ఉంది అని కమల్ హాసన్ అన్నారు.
అయితే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావల్సింది. కానీ, ఈ చిత్రానికి యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లోకేష్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమ్' సినిమా 2022లో భారీ విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల రజినీకాంత్‌తో లోకేష్ తీసిన 'కూలీ' సినిమా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి కలయికపై అంచనాలు భారీగా ఉన్నాయి.
1970లలో తమ గురువు, దివంగత లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ మార్గదర్శకత్వంలో కమల్, రజినీకాంత్ ఇద్దరూ తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు కలిసి నటించిన అపూర్వ రాగంగల్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ వంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. 1979లో వచ్చిన 'అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్' సినిమా తర్వాత దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఇద్దరూ కలిసి నటించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించబోతున్న సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి