లూ–కేఫ్​లు లూటీ..!.. రెండు జోన్లలో 60 ఏర్పాటు చేసిన బల్దియా 

లూ–కేఫ్​లు లూటీ..!.. రెండు జోన్లలో 60 ఏర్పాటు చేసిన బల్దియా 
  •     మెయింటినెన్స్ పట్టించుకోని ఏజెన్సీలు
  •     పలు చోట్ల ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణ 
  •     ఏ ఒక్కచోట సరిగా పనిచేయట్లేదు
  •      సిటీవాసులకుఅందుబాటులో లేవు

 హైదరాబాద్, వెలుగు : సిటీలో బల్దియా ఏర్పాటు చేసిన లూ– కేఫ్ లు లూటీ అయ్యాయి. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(డీబీఎఫ్ వోటీ) పద్ధతిలో 60  కేఫ్ లను 2018, జులైలో అందుబాటులోకి తెచ్చింది.  తొలిదశలో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ప్రారంభించింది.  సిటీవాసులకు టాయిలెట్ల సమస్య తీర్చడంతో పాటు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేశారు.  వీటిని15 ఏండ్ల అగ్రిమెంట్ కింద మెస్సర్స్, ఇక్సోరా ఏజెన్సీలకు అప్పగించింది. మొదటి మూడేండ్ల పాటు ఏడాదికి రూ.40 వేలు అద్దెను బల్దియాకు ఏజెన్సీలు చెల్లించాలి.

ప్రస్తుతం మూడేండ్లు కూడా దాటిపోయాయి. అయితే.. లూ కేఫ్ లో ముందు భాగంలో బిజినెస్​ కోసం స్పేస్ ఉంటుంది. వాటి వెనుక భాగంలో లగ్జరీ స్మార్ట్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. లూ కేఫ్ లో వ్యాపారం చేసుకునేందుకు ఏజెన్సీల నుంచి అద్దెకు తీసుకునేవారు ఏరియాని బట్టి చెల్లించాలి. అద్దె ద్వారా వచ్చిన ఆదాయంతో టాయిలెట్ మెయింటెనెన్స్ చేయించాలి. వీటిని రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారా? లేదా అనేది బల్దియా అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. వాటిని అధికారులు పట్టించుకోవడమే లేదు. కేఫ్ ల్లో ఇప్పటికే సగానికిపైగా లూటీ అయ్యాయి. అవి ఎక్కడ ఉన్నాయనే వివరాలు కూడా బల్దియా వద్ద లేవు. 

ప్రైవేట్ వ్యక్తుల వసూళ్లు..

 కేఫ్ ల మెయింటెనెన్స్ ను ఏజెన్సీలు కూడా పట్టించుకోవడంలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తులకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్నిచోట్ల వాటిని కబ్జా చేసేశారు.  ఇంకొన్నిచోట్ల వేరే ప్రాంతాలకు తీసుకుపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో కేఫ్ లు అస్తవ్యస్తంగా మారాయి.   ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఏర్పాటైన వీటిని కమర్షియల్ ప్రాంతాల్లో  ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అద్దె రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. ఏజెన్సీలు అద్దెలు కలెక్ట్ చేసే చోట కూడా టాయిలెట్లకు తాళాలు వేసి  ఉంటున్నాయి. 

అధికారులకు తెలియట్లే.. 

లూ కేఫ్ లు ఉన్నాయనేది అధికారులకు కూడా తెలియదు. అవి ఎక్కడ ఉన్నాయి.. వాటి నిర్వహణ ఎలా ఉందనేది మరిచిపోయారు. అసలు ఎవరు అద్దె కలెక్ట్ చేస్తున్నారనేది స్పష్టతలేదు. ప్రస్తుతం నడుస్తున్న లూ కేఫ్ లు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయనే వివరాలు లేవంటే వీటిపై బల్దియా అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేఫ్ లపై ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చేస్తున్నా కూడా జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో అటు ఆదాయం రావడంలేదు. ఇటు సిటిజన్స్ కి ఎలాంటి ఉపయోగంగా లేవు. మొత్తంగా లూ కేఫ్ లపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకొని తిరిగి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని జనం కోరుతున్నారు.